కంచరపాలెం సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం.. ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కంచరపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. జగన్ సభకు జనం ప్రభంజనంలా వెల్లువెత్తడం అధికార పార్టీ నేతల్లో కలవరం వ్యక్తమవుతోంది. కంచరపాలేనికి విశాఖతోపాటు పరిసర ప్రాంతాల నుంచి జనం సునామీలా పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంతగా సభ జనంతో కిటకిటలాడింది. పలు మార్గాల్లో అడుగుతీసి అడుగువేయలేనంతగా కిక్కిరిసిపోయారు.
‘సంతృప్తి’ నివేదికలపై పునరాలోచన
ప్రజాసంకల్పయాత్ర గుంటూరు నుంచి కనకదుర్గవారధి మీదుగా విజయవాడలోకి అడుగిడినప్పుడు, తూర్పు గోదావరిలోకి ప్రవేశించిన సందర్భంగా రాజమండ్రి రైల్‌కమ్ రోడ్ బ్రిడ్జిపై సాగిన పాదయాత్రకు, ఆ తరువాత బహిరంగ సభకు అశేష జనవాహిని తరలిరావడంతో టీడీపీలో ప్రకంపనలు ఏర్పడటం తెలిసిందే. తాజాగా కంచరపాలెం సభకూ జనం తండోపతండాలుగా రావడం అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. సభ వివరాలపై పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులతోపాటు విశాఖ పోలీసు కమిషనర్ మహేష్‌చంద్రలడ్డాను పిలిచి సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. జగన్ ప్రసంగానికి ప్రజలు కరతాళధ్వనులతో మద్దతు పలకడం టీడీపీ పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు నిలువుటద్దంలా మారింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వం, పార్టీ పట్ల 80%కు పైగా సంతృప్తి ఉందంటూ వివిధ ఏజెన్సీల ద్వారా తెప్పించుకుంటున్న నివేదికల్లో వాస్తవాలపై బాబు పునరాలోచనలో పడ్డట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
అసెంబ్లీ లాబీల్లో చర్చ
కంచరపాలెం సభకు లభించిన స్పందన అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల్లో చర్చకు దారితీసింది. సంతృప్త స్థాయిపై తమకు అందుతున్న నివేదికలన్నీ వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ప్రజల తాజా స్పందనతో తేటతెల్లమవుతోందని కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలే పేర్కొనడం విశేషం. మరోపక్క కొందరు మంత్రులు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సమయంలోనూ కంచరపాలెం సభపైనే చర్చ సాగింది.
అధికారులపై సీఎం ఆగ్రహం!
జగన్ ప్రభంజనాన్ని ఇతరులతో పోల్చడం, తక్కువగా అంచనా వేయడం ఏమాత్రం సరికాదని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రలకు వస్తున్న స్పందన అన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం చూపుతోందని మరోనేత పేర్కొన్నారు. తమ అధినేతకు కంచరపాలెం సభపై విభిన్న మార్గాల ద్వారా స్పష్టత వచ్చిందని, అందువల్లే విశాఖ కమిషనర్ ఉన్నఫళంగా పిలిచారని ఓ టీడీపీ నేత చెప్పారు. జగన్ సభ తర్వాత తన వద్దకు వచ్చిన అధికారులుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని అసెంబ్లీలో కొందరు అధికారుల మాటల ద్వారా వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment