సాక్షి, అమరావతి: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 40 మంది టీంఎంసీ ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని మోదీ చెబితే.. ప్రధాని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నారని మాట్లాడుతన్న చంద్రబాబు గతంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నప్పుడు, వైస్రాయ్ హోటల్‌లో ఎన్టీఆర్‌కు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని చంద్రబాబును నిలదీశారు.
కర్ణాటక ఎలక్షన్‌లో హంగ్ వచ్చినప్పుడు జేడీఎస్ నేత కుమారస్వామికి సపోర్టు చేసిన 110 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి హోటల్‌లో దాచినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మాట అన్నారు.. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తమరు ఎన్ని వేషాలు వేశారో మర్చిపోయారా అంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment