
కన్నాలక్ష్మీనారయణ (ఫైల్ ఫొటో)
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి అని అధికారం ఇస్తే ప్రశ్నించే గొంతుకులను అణచివేసే సంస్కృతిని తీసుకొచ్చారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్యాయం జరుగుతోందని మాట్లాడితే అణచివేసే ధోరణిలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, కేసులు పెట్టడం మంచి పద్దతికాదని హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ ధోరణి మార్చుకోకుంటే నాలుగు మాసాలనంతరం ప్రజలే తిరగబడుతారని హెచ్చరించారు. 2019లో చంద్రబాబుకి ప్రజల సమస్యలు కనబడేలా, వినబడేలా చేస్తామన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అనేక దేవాలయాలను కూల్చివేశారని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు చెబితే వయసు పరిమితి పెట్టి ఆయన్ను తీసేశారని మండిపడ్డారు.