
కన్నాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి బ్యూరో: బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే గుంటూరు వెస్ట్‌తో పాటు, పెదకూరపాడు నియోజకవర్గంలో తన అనుచరులతో పలుమార్లు సమావేశమై వైఎస్సార్‌సీపీలో చేరికపై చర్చించారు.
ఈ మేరకు బుధవారం కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు, మాజీ మేయర్ కన్నా నాగరాజు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్ళ వెంకటేష్‌యాదవ్, చదలవాడ వేణుబాబు, బీజేపీ నగర యువమోర్చా అధ్యక్షుడు శిఖాకొల్లి అభినేష్, నగర ప్రధాన కార్యదర్శి కొల్లి సుబ్బారెడ్డి, బీసీ మోర్చా నగర అధ్యక్షుడు రాచమంటి భాస్కరరావు, పరుచూరి సంజయ్, తాడిశెట్టి రఘు, మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.
మంగళవారం కన్నాను ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుంటూరులోని నివాసం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరనున్నారు. కన్నా గతంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.