
మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు, పక్కన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్
సాక్షి, అమరావతి: వరదలు, వర్షాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడితే దానిని సాకుగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లేందుకు ఉబలాటపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారిద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వారు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుకను రాజకీయం చేస్తూ చంద్రబాబు పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే.. ఇపుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో లాంగ్‌మార్చ్ చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందనే విషయం అందరికీ తెలుసన్నారు. వరదలు తగ్గాక ఇసుక తవ్వకం దిశగా అధికారులు పని చేస్తున్నారని చెప్పారు.
జనసేనతో గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సీపీఐ, సీపీఎం ఇపుడు ఆ పార్టీతో కలిసి ప్రయాణించలేమని ప్రకటించాయని, తమ ఉద్యమాలేవో తాము చేసుకుంటామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు, పవన్ చాలా కాలంగా కలిసే లాంగ్ మార్చ్ చేస్తున్నారని, వీరి ఆత్మీయానుబంధం ఏమిటో రాష్ట్ర ప్రజలు ఐదేళ్లుగా చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక తవ్వకాల్లో ఇష్టానుసారం దోపిడీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అమలులోకి వచ్చే లోపు వరదలు వచ్చాయన్నారు.
267 రీచ్‌లలో అనుమతి ఇస్తే కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక తీయగలుగుతున్నారని మంత్రులు వివరించారు. వరదలు తగ్గగానే పుష్కలంగా ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. బాబు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ, అరాచకాలపై పవన్ ఏనాడూ ప్రశ్నించలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన రూ.900 కోట్లను పక్కదారి పట్టించినపుడు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేస్తే పవన్ మద్దతు కూడా ప్రకటించలేదన్నారు. పవన్‌ది లాంగ్ మార్చ్ కాదని.. రాంగ్æ మార్చ్ అన్నారు. బాబు అజెండాను పవన్ అమలు చేస్తున్నారని, టీడీపీ నేతలు లాంగ్ మార్చ్‌కు హాజరవ్వాలనుకోవడాన్ని బట్టే వారి బంధం బయట పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment