కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావజాలాన్ని దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడమే నరేంద్ర మోదీ సర్కార్ తమ అజెండాగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో ఆరెస్సెస్ ప్రచారక్‌లను కీలక స్థానాల్లో నియమించి బాధ్యతలు అప్పగించడాన్ని గుర్తుచేశారు. ప్రతి వ్యవస్థలో ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది కేంద్రం పన్నిన కుట్ర అని పేర్కొన్నారు.
నేడు విద్యాసంస్థలతో పాటు న్యాయవ్యవస్థ, పరిపాలన విభాగాల్లోనూ ఆరెస్సెస్ నేతలు, ప్రచారక్‌లను ఎన్డీఏ ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టడం సబబు కాదన్నారు కపిల్ సిబల్. దేశంలోని ప్రతిసంస్థపై కేంద్ర ప్రభుత్వం తమ ప్రభావం ఉండాలని తాపత్రయ పడుతోందని, వాటి సాయంతో మీడియాను, న్యాయవ్యవస్థతను నియంత్రించాలని దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ న్యాయ విభాగంలోనూ ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ప్రచారక్‌లకు బాధ్యతలు అప్పగిస్తే న్యాయవ్యవస్థ చాలా బలహీనం కావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ముందు సీబీఎస్‌ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment