కమలం గూటికి ఉమ..? | Karimnagar ZP Chairperson Tula Uma May Be Joins In BJP | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 3:47 PM | Last Updated on Tue, Nov 6 2018 8:56 AM

Karimnagar ZP Chairperson Tula Uma May Be Joins In BJP - Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌.. మేడిపల్లి మండలం మోత్కురావుపేట ఆడబిడ్డ తుల ఉమ త్వరలోనే కమలం గూటికి చేరునున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే టికెట్‌ ఖరారైతే ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే ఆలోచనతో ఆమె ఉన్నారా..? ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అంటే ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. వేములవాడ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన తుల ఉమ.. ఈనెల 24న ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు ఆధ్వర్యంలో తన పుట్టినిల్లయిన మేడిపల్లిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు డుమ్మా కొట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొదట్నుంచే రమేశ్‌బాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉమ.. ఆశీర్వాద సభకు హాజరైతే ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నట్టే అని అందరూ భావించారు. కానీ ఆమె సభలో పాల్గొనకపోవడం.. మరుసటి రోజే అక్కడే తన క్యాడర్‌తో సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే బరిలో ఉండాల్సిందేనంటూ ఉమపై ఆమె క్యాడర్‌ తీవ్రఒత్తిడి తీసుకురావడంతో ఆమె బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అనే విషయంపై ఉమ తన క్యాడర్‌కు స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క రమేశ్‌బాబు జర్మనీ పౌరసత్వం కేసుకు సంబంధించి ఈనెల 26న కోర్టులో విచారణ ఉంది. ఇందులో ఏ తీర్పు వస్తుందో వేచిచూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలనే ఆశతో ఉమా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తీర్పు రమేశ్‌బాబుకు అనుకూలంగా వస్తే బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రతికూల తీర్పు వస్తే.. వేములవాడ టికెట్‌ తనకే వరిస్తుందనే ధీమాతో ఉన్నారు.
 
ఉమ వైపు బీజేపీ చూపు..?
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బీజేపీ కొన్నిరోజుల క్రితం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో వేములవాడ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఉమపై పార్టీ ఆరా తీసినట్లు సమాచారం. ఇదే క్రమంలో వ్యక్తిగతంగా మంచి ఇమేజ్‌ ఉన్న.. సున్నిత మనస్కురాలిగా పేరొందిన తుల ఉమకు వేములవాడ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో హైదరాబాద్‌లో కలవడం అప్పట్లో చర్చకు దారి తీసింది. తాజాగా బీజేపీ జాతీయ నాయకులు ఉమతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీనే నమ్ముకుని ఉన్న ప్రతాపరామకృష్ణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రతాప రామకృష్ణను కాదని ఉమకు టికెట్‌ ఇస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని బీజేపీ నేతలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచే..
2001 టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచే తుల ఉమ పార్టీలో కొనసాగుతున్నారు. అప్పట్నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న ఆమె 2014 ఎన్నికలతోపాటు ఈసారీ తన నియోజకవర్గమైన వేములవాడ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీనికి తోడు వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, తుల ఉమల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న పోరు తారస్థాయికి చేరుకుంది. ఈక్రమంలోనే ఆమె ఉమ పార్టీపై కాస్త అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు రమేశ్‌బాబు, తుల ఉమకు చెందిన రెండువర్గాలుగా చీలిపోయారు. కొన్నాళ్ల నుంచి ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం తుల ఉమకు మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో బాగా పట్టు ఉంది. ఇటు వేములవాడ, చందుర్తి, కోనరావుపేట మండలాల్లోనూ కొంత క్యాడర్‌ ఉంది.

కేసీఆర్‌నే నమ్ముకుని ఉన్న: తుల ఉమ
టీఆర్‌ఎస్‌ ఏర్పాటు రోజు నుంచే నేను మా పార్టీ అధినేత కేసీఆర్‌పై నమ్మకంతో ఉన్న. వేములవాడ టికెట్‌ నాకే వస్తుందనే నమ్మకం ఉంది. మంత్రులు ఈటల, కేటీఆర్, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికైతే టీఆర్‌ఎస్‌ను వీడే ఆలోచన లేదు. హైదరాబాద్‌లోని మా బంధువు ఇంటికి వెళ్లగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ యాదృచ్ఛికంగా కలిశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement