కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మలుపు | Karnataka Assembly Elections 2018: Polling Deferred In RR Nagar | Sakshi
Sakshi News home page

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మలుపు

Published Fri, May 11 2018 7:05 PM | Last Updated on Fri, May 11 2018 7:51 PM

Karnataka Assembly Elections 2018: Polling Deferred In RR Nagar - Sakshi

సాక్షి, బెంగళూరు : మరికొద్ది గంటల్లో (మే 12) పోలింగ్‌ జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. నకిలీ ఐడీ కార్డుల ఉదంతం నేపథ్యంలో బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడింది. మే 28 లేదా 31వ తేదీన పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

కాగా రాజరాజేశ్వరి నియోజకవర్గంలో 9746 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు దొరికిన విషయం విదితమే. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్‌ అయి ఉన్న అపార్ట్‌మెంట్‌లో నకిలీ కార్డుల ప్రింటింగ్‌ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన ఆర్‌ఆర్‌ నగర్‌ పోలింగ్‌ను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

అందరి చూపు కర్ణాటక వైపు...
దేశంలో అందరి చూపు కర్ణాటక 15వ శాసనసభ ఎన్నికలపైనే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభం కానుంది.  ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6.30 గంటల వరకు జరుగనుంది. రాష్ట్రంలోని 223 నియోజకవర్గాలకు పోలింగ్‌ సాగుతుంది. అయితే శనివారం భారీ వర్షం పడుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు పోలింగ్‌ గడువును ఒక అర్ధ గంట పాటు పొడిగించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 2,5205,820 పురుష ఓటర్లు, 2,23,15,727 మంది మహిళా ఓటర్లు మరో నాలుగు వేల మందికి పైగా హిజ్రాలు తమ ఓటు హక్కును ఈ సారి వినియోగించుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్రంలోని 60 పింక్‌ కేంద్రాలతో కలుపుకుని మొత్తం 58,808 కేంద్రాల్లో పోలింగ్‌ సాగుతుంది. దీంతోపాటు 73,185 కంట్రోల్‌ యూనిట్లు, 87,819 బ్యాలెట్‌ యూనిట్లు పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగిస్తున్నారు. మొత్తం 1,503 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎలాంటి ప్రలోభాలు జరుగకుండా, నిషేధిత వస్తువులు రాష్ట్రంలోకి చొరబడకుండా ఎన్నికల సంఘం గట్టి భద్రత చర్యలు చేపట్టింది.

పోటీలో మొత్తం 2,655 మంది..
బీజేపీ 223 స్థానాల్లో, కాంగ్రెస్‌ 222 స్థానాలు, జేడీఎస్‌ 201, బీఎస్సీ 18, సీపీఎం 19, ఎన్‌సీపీ 14 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 1,155 చోట్ల పోటీ చేస్తున్నారు. 2,436 మంది పురుషులు, 219 మంది మహిళా అభ్యర్థులతో కలుపుకుని మొత్తం 2,655 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కట్టుదిట్టమైన భద్రతా..
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, కేఎస్‌ఆర్‌పీ, ఆర్‌ఏఎఫ్‌ కలుపుకుని 56,696 మంది భద్రతా దళాలు మోహరించాయి. రామనగర, కనకపుర, శికారిపుర, మాలకాల్మురు, బాదామి, బెళగావి, గోవిందరాజనగర తదితర సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఈ భద్రతా దళాలను ఎన్నికల సంఘం మోహరించింది.నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలైన ఉడుపి, శివమొగ్గ, మలేనాడు ప్రాంతంలో భద్రతను మరింత అధికంగా చేపట్టింది. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. రాష్ట్రంలోని బెంగళూరులో 1,595, బెళగావిలో 891, మైసూరులో 632, తుమకూరులో 528, దక్షిణ కన్నడ జిల్లాలో 483 కేంద్రాలతో కలుపుకుని మొత్తం 12,002 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలని ఎన్నికల సంఘం నిర్ధారించింది. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరూ ప్రచారం నిర్వహించకూడదు.

పోలింగ్‌ సామగ్రితో సిద్ధంగా సిబ్బంది..
ఎన్నికల సిబ్బంది శుక్రవారం ఓటర్ల జాబితా, ఈవీఎం బాక్సు, వీవీప్యాట్‌ యంత్రంలను తీసుకుని తమ పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాగా, 224 నియోజకవర్గాలున్న శాసనసభ స్థానాలకు 223 చోట్ల మాత్రమే పోలింగ్‌ జరుగనుంది. బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో ఎన్నికల బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ హఠాత్తు మరణంతో ఆ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లను ఎన్నికల సంఘం అమలులోకి తీసుకొచ్చింది. ఓటర్‌ ఎవరికికి ఓటు వేశారో నిర్ధారిస్తూ వీవీప్యాట్‌ నుంచి స్లిప్‌ వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement