సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ సీట్లు రాకపోవడంతో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. నాటి నుంచి ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుస్తీ పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలోకన్నా ఎక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నుంచి వస్తోన్న ఒత్తిడులకు సంకీర్ణ ప్రభుత్వం వణికిపోతోంది. సంకీర్ణ పక్షాల మధ్య సరైన సమన్వయం లేనందున తాను పదవి నుంచి తప్పుకుంటానని జేడీ (సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు ఏహెచ్ విశ్వనాథ్ మంగళవారం మీడియా ముఖంగా హెచ్చరించడం పరిస్థితి పరాకాష్టకు ప్రత్యక్ష ఉదాహరణ.
విశ్వనాథను పార్టీ అధ్యక్షుడి స్థాయికి తీసుకొచ్చిందీ దేవెగౌడ కుటుంబమే అయినప్పటికీ పార్టీలో ఉన్న అసమ్మతివాదులు, పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం భావిస్తున్నవారు ఆయన్ని ఎగదోస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు రామలింగారెడ్డి మంగళవారం నాడు సోషల్ మీడియాను ఆశ్రయించి తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు సంకీర్ణ ప్రభుత్వ నాయకత్వాన్ని విమర్శించారు. పార్టీ సీనియర్ సభ్యులను ఇలా పక్కన పెట్టడం సరికాదంటూ ఆయన పార్టీ నాయకత్వాన్ని కూడా హెచ్చరించారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలంటూ ముఖ్యమంత్రి కుమార స్వామిపై తీవ్ర ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నేతల ప్రకటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంత్రి వర్గంలో ఉన్న మూడు ఖాళీలను స్వతంత్య్ర అభ్యర్థుల ద్వారా భర్తీ చేసుకొని సంకీర్ణ ప్రభుత్వం బలాన్ని పెంచుకోవాలని కుమారస్వామి ఆలోచిస్తుంటే మంత్రి పదవుల కోసం ఇరు సంకీర్ణ పక్షాల నుంచి పోటీ పెరిగింది.
గత జనవరి నెలలోనే కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుంటుండడం వల్ల తాను ముఖ్యమంత్రిలా కాకుండా ఓ గుమాస్తాలా పనిచేయాల్సి వస్తోందని అన్నారు. అన్న తర్వాత ఆయన తన మాటలను మీడియా వక్రీకరించిందంటూ సర్దుకున్నారు. మళ్లీ తన పరిస్థితి గరళం మింగిన శివుడిలా ఉందని అన్నారు. అప్పట్లోనే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న వార్తలు వచ్చాయి. అది నిజం కాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సంకీర్ణ పక్షాలకు ఓటమి ఎదురవడంతో మళ్లీ ప్రభుత్వం నైరాశ్యంలో పడిపోయింది. ప్రభుత్వ మనుగడను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోక పోవడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉంది. ముందుగా దాన్ని పట్టించుకుంటే నాలుగు రోజులపాటు ప్రభుత్వం పడకుండా ఉంటుంది. లేకపోతే కుమార స్వామి గొంతులోని ‘గరళం’ కడుపులోకి పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment