
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కస్ టీమ్ తెలంగాణలో ప్రదర్శనలు చేసిందని, ఆ పార్టీ ఎన్ని ఫీట్లు చేసినా ప్రజలు పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
బస్సుయాత్ర చేసిన కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎన్నికల్లోనూ పుట్టగతులుండవని హెచ్చరించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా టీఆర్‌ఎస్ నేతలపై, మంత్రులపై కాంగ్రెస్ నోరు పారేసుకుంటోందని మండిపడ్డారు. మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ పీనుగ లాంటిది: రసమయి
బడుగు బలహీనవర్గాలకు అండగా ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పిచ్చి పట్టినట్టుగా విమర్శలు చేశారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పీనుగ లాంటిదని, అది కోలుకునే పరిస్థితి లేదన్నారు. రేవంత్‌రెడ్డికి మైక్ దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రజలు ఆయనను జోకర్‌లాగా చూసి నవ్వుతున్నారన్నారు.