
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ (ఫైల్ ఫోటో)
సాక్షి, గుంటూరు : నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సోమవారం నుంచి ‘ కావాలి జగన్..రావాలి జగన్’ అనే కార్యక్రమాన్ని175 నియోజక వర్గాల్లో చేపడుతున్నామని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి సమన్వయ కర్త ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను జనంలోకి తీసుకెళ్తూ వాటి ద్వారా చేకూరే లబ్ధిని తెలియజేయాలన్నారు.
అధికారం పోతుందని తెలిసే టీడీపీ నేతలు అవినీతి, దోపీడీలకు పాల్పడుతున్నారని బొత్స విమర్శించారు. చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని పాలించడం వదిలేసి దోచుకోవడమే పరమావధిగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. బాబు దోపిడీలను ప్రజలకు వివరిస్తూనే అధికారంలోకి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలి : ఉమ్మారెడ్డి
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. మరీ ముఖ్యంగా బూత్ కమిటీ సభ్యులు అలర్ట్‌గా ఉండాలన్నారు. పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే న్యాయం జరుగుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. నవరత్నాల వల్ల కలిగే లబ్దిని జనాలకు వివరించాలని పార్టీ సభ్యులకు సూచించారు.