
సాక్షి, జగిత్యాల: మేడ్చల్‌లో సభలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తన ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్టే చదివారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ గడ్డపై నుంచి పక్క రాష్ట్రానికి హామీలు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. శనివారం జగిత్యాలలో విలేకరులతో కవిత మాట్లాడారు. ఇతర రాష్ట్రాల అంశాలను మన రాష్ట్రంలో ప్రస్తావిస్తున్నారంటే తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిన్నచూపు తెలుస్తోందని చెప్పారు. ముఖ్యంగా పక్క రాష్ట్రం ఎజెండా తెలంగాణలో అమలు చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై టీఆర్‌ఎస్ ఎంపీలు 40 సార్లు పార్లమెంట్‌ను స్తంభింపజేశారని గుర్తు చేశారు. కానీ ఇన్నాళ్లకు తెలంగాణకు వచ్చిన సోనియా ఏపీ రాష్ట్రం ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని చెప్పడం ఈ ప్రాంత ప్రజలను అవమానపర్చినట్టేనని వ్యాఖ్యానించారు.
సోనియా, రాహుల్ గాంధీ ఏనాడూ పార్లమెంటులోగానీ, బహిరంగ సభల్లోగానీ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడలేదని చెప్పారు. అలాంటి వారికి ఓటెలా వేస్తారో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతిరోజు కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపి అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రజల హక్కుల గురించి ఏనాడూ వారివారి పార్టీల్లో చర్చించలేదని విమర్శించారు. మేడ్చల్ సభలో సోనియా తెలంగాణ హక్కుల గురించి ప్రస్తావించకపోవడాన్ని రమణ ఎలా భావిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జగిత్యాలలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థులు సంజయ్‌కుమార్, కె.విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment