
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైందా? తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆదివారం కొంగర కలాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు కేవలం కొన్ని గంటల ముందే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుండటం ఇవే సంకేతాలిస్తోంది! ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కేబినెట్ భేటీ నిర్వహించుకునే అవకాశం ఉన్నా బహిరంగ సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ సమావేశం జరగనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతోపాటు శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.
డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతోపాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలంటే ఇక్కడ శాసనసభను రద్దు చేస్తేనే సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా ఆదివారం మంత్రివర్గ సమావేశంలో శాసనసభ రద్దుకు తీర్మానం చేయవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముసుగులో గుద్దులాట ఇష్టం ఉండదు. చెప్పదలచుకున్నది, చేయదలచుకున్నది ఆయన స్పష్టంగా చెబుతారు, ఆయన వైఖరి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆయన మనస్తతత్వం తెలిసిన ఎవరైనా ఆదివారం ఏ నిర్ణయం తీసుకుంటారో వేరే చెప్పనవసరం లేదు’అని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం ముందు చాలా ఎజెండా ఉన్నదని చెప్పిన సదరు సీనియర్ మంత్రి... శాసనసభ రద్దు విషయంలో తనకు ఇప్పటిదాకా స్పష్టత లేదని పేర్కొన్నారు. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ దిశగానే వెడుతున్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఒకరు శుక్రవారం రాత్రి సాక్షి ప్రతినిధితో చెప్పారు.
ఉద్యోగులు, ఇతర వర్గాల వారి ప్రయోజనాలపై నేడే నిర్ణయం...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి మధ్యంతర భృతి, డీఏ పెంపు, ఉద్యోగ ఖాళీల భర్తీ వంటి వాటికి సంబంధించి శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశం కేవలం శాసనసభ రద్దు సిఫారసుకే పరిమితం అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పాతిక లక్షల మందిని ఒక చోట చేర్చి సభ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ముఖ్యమైన నిర్ణయాన్ని వారి సమక్షంలో చెప్పేందుకు వీలుగా ఆదివారం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారని వారంటున్నారు. నాలుగున్నర సంవత్సరాలలో తన ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతోపాటు తాను ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వస్తోందో కూడా ఈ సమావేశంలో కేసీఆర్ వివరిస్తారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కొద్ది మాసాల ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలను కేసీఆర్ ఇప్పటిదాకా కొద్ది మంది పార్టీ నాయకుల దగ్గరే వివరించారని, ఆదివారం భారీ ప్రజానీకం ముందు ఈ వివరాలు ఉంచుతారని ఆ సీనియర్ నాయకుడు వెల్లడించారు.
అదే రోజు గవర్నర్‌కు తీర్మానం అందజేయనున్న సీఎం...
అందరూ అనుకుంటున్నట్లు శాసనసభను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేస్తే సమావేశం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలుస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలియజేశాయి. శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్‌కు అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రగతి నివేదిన సభకు వస్తారని సమాచారం. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కూడా ఇదే కారణమని, ప్రజలకు ఈ విషయాలను వివరించడం ద్వారా ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పికొట్టవచ్చన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నదని ఒక మంత్రి చెప్పారు. నాలుగైదు నెలల ముందు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలను ప్రజలకు నేరుగా వివరించడమే కేసీఆర్ లక్ష్యమని ఆ మంత్రి పేర్కొన్నారు. అయితే ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో శాసనసభ రద్దు ఉంటుందా లేదా అనే విషయంలో మంత్రులకు స్పష్టత లేదు. కచ్చితంగా ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారన్నది మాత్రం మెజారిటీ మంత్రుల అభిప్రాయంగా ఉంది.