సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని గత కొంతకాలంగా సాగుతున్న చర్చపై ఉత్కంఠ వీడలేదు. టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ ద్వారా ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు స్పష్టతనిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరిగినప్పటికీ ఆదివారం అలాంటిదేమీ జరగలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారనే గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు సూచించాయి. అందుకు అనుగుణంగానే ప్రగతి నివేదన సభలో ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. అయితే ముందస్తు ఆలోచనపై కేసీఆర్ తన మనసులోని మాటను ఎక్కడా బయటపెట్టలేదు. కానీ కేసీఆర్ మాట్లాడిన తీరు ముందస్తుపై రకరకాలుగా అన్వయించుకునే ఆస్కారం కల్పించి మరింత ఉత్కంఠకు తెరలేపారు. ఆదివారం హైదరాబాద్ నగర శివారులోని కంగర కొలాన్ లో జరిగిన ప్రగతి నివేదిన సభ ప్రారంభానికి ముందు కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశంలోనే ముందస్తుపై ఒక నిర్ణయం తీసుకుంటారని, ఆ నిర్ణయాలను సభలో వివరిస్తారని ఒక ప్రచారం జరిగింది. అయితే, కొన్ని వర్గాలకు సంబంధించి వరాలు ప్రకటించడం వరకే కేబినేట్ సమావేశాన్ని పరిమితం చేశారు.
కేబినేట్ సమావేశంలో ముందస్తుపై నిర్ణయం చేయకపోవడంతో ఆ అంశంపై ప్రగతి నివేదన సభలోనైనా కేసీఆర్ కొంత స్పష్టతనిస్తారని పార్టీ నేతలు భావించారు. అయితే, మరికొద్ది రోజుల్లోనే మరోసారి కేబినేట్ సమావేశం ఉంటుందని మంత్రులు చేసిన ప్రకటన, ఆ తర్వాత సభలో కేసీఆర్ చెప్పిన మాటలు బేరీజు వేసుకుని విశ్లేషించుకుంటే ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్న ఉత్కంఠ వీడకపోగా మరింత సస్పెన్స్ లోకి నెట్టినట్టయింది. ప్రగతి నివేదన సభలో 50 నిమిషాలపాటు ప్రసంగించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సూటిగా ఎలాంటి విషయాలను చెప్పలేదు. అయితే, ఈ విషయంలో ఏది మంచి నిర్ణయమైతే అది తీసుకోవాలని కోరుతూ మొత్తం కేబినేట్ మంత్రులు తనకు అధికారం అప్పగించారన్న విషయాలు కేసీఆర్ సభలో తెలియజేశారు. దాంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది.
ముందస్తుకు సంబంధించి... రాజకీయపరమైన అంశాల్లో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కు కేబినేట్ కట్టబెట్టగా, మరికొద్ది రోజుల్లో నిర్వహించబోయే కేబినేట్ సమావేశం కీలకమవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ నాయకుడు కే కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయనున్నామని, టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. అలా అంటూనే, కేసీఆర్ తన ప్రసంగంలో మరో వారంలో రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటామని చేసిన వ్యాఖ్యలు ముందస్తుపై మళ్లీ ఉత్కంఠకు తెరలేపింది. కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. వారం రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలకు సిద్ధం కావలసిందే అని కొందరు నేతలు భావిస్తుంటే అసెంబ్లీని రద్దు చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని, వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడంలోనే ఆయన నిమగ్నమయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ముందస్తుకు వెళ్లడంపై ప్రజలు, పార్టీ శ్రేణుల అభిమతాన్ని తెలుసుకోవడానికి ముందస్తుపై చర్చకు తెరలేపారని, పార్టీ పరంగా నిర్వహించిన కీలకమైన ప్రగతి నివేదక సభ పూర్తయిన నేపథ్యంలో సమావేశమయ్యే వచ్చే కేబినేట్ లో కీలకమైన నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
వచ్చే డిసెంబర్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ రాష్ట్రాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలంటే ఈ నెల మొదటి వారంలో సభను రద్దు చేయాల్సి ఉంటుందని, తాజా పరిస్థితుల్లో త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశం అత్యంత కీలకంగా మారుతుంది. ఆ కేబినేట్ సమావేశంతో మాత్రమే ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? లేదా అన్న సస్పెన్స్ కు తెరపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment