సాక్షి, హైదరాబాద్: ఉద్యమ నేపథ్యం నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్ నేతల నడుమ అంతర్గత పోరు నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారికి.. ఆ తర్వాత వివిధ రాజకీయపక్షాల నుంచి వచ్చిన నేతల నడుమ క్షేత్ర స్థాయిలో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర పదవుల భర్తీతో మొదలైన పదవుల పందేరం... అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పార్టీలో దీర్ఘకాలికంగా పని చేస్తున్న నాయకులతోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలు చేస్తున్న ‘ఓనర్లు.. కిరాయిదార్లు’ వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. రాజకీయ పునరేకీకరణతో తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి రాజకీయ వలసలను ప్రోత్సహించిన టీఆర్‌ఎస్.. ఆ రెండు పార్టీలను అసెంబ్లీలో సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసింది. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం దిశగా పావులు కదుపుతున్న బీజేపీ.. తిరిగి అదే వ్యూహాన్ని అనుసరిస్తూ టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు టీఆర్‌ఎస్ అసమ్మతులను టార్గెట్ చేయడం గులాబీదళంలో గుబులు రేపుతోంది.
రాజకీయ పునరేకీకరణతో...
రాష్ట్ర సాధన ఉద్యమంతోపాటు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి క్షేత్రస్థాయి మొదలుకొని బడా నాయకుల వరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. వలస నేతల జాబి తాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారడంతో టీఆర్‌ఎస్‌లోకి రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. 2014 నుంచి 2018 మధ్య పార్టీలో చేరిన నేతల్లో 28 మంది ప్రస్తుత శాసనసభలో టీఆర్‌ఎస్ శాసనసభ్యులుగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి గెలుపొందిన మరో 14 మంది శాసనసభ్యులు టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. మొత్తంగా ప్రస్తుత శాసనసభలో టీఆర్‌ఎస్‌కు 103 మంది శాసనసభ్యుల బలం ఉండగా అందులో 40 శాతం మంది అంటే 42 మంది ఎమ్మెల్యేలు 2014 తర్వాత టీఆర్‌ఎస్ గూటికి చేరిన వారే ఉన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఎనిమిది మంది మంత్రులు 2014 తర్వాత గులాబీ గూటికి చేరిన వారు కావడం గమనార్హం. ఎంపీలు, ఎమ్మెల్సీల్లోనూ సంఖ్యాపరంగా వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన వారి సంఖ్య.. ఉద్యమకాలంలో పనిచేసిన వారి సంఖ్యతో దాదాపు సమానంగా ఉంది.
టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ గూటికి...
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారు.. ఆ తర్వాత వచ్చి చేరిన నేతల నడుమ నియోజకవర్గ స్థాయిలో పొసగకపోవడంతో సిగపట్ల రాజకీయం నడుస్తోంది. మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర పదవులు ఆశిస్తున్న నేతల్లో పాత, కొత్త తేడా లేకుండా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నేతల నడుమ పొసగకపోవడంతో గ్రూపు రాజకీయాలు పోటాపోటీగా సాగుతున్నాయి. చొప్పదండి, దేవరకొండ, అందోల్ వంటి నియోజకవర్గాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కని నేతలు.. ఇతర పార్టీల్లో చేరారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), వివేక్ (పెద్దపల్లి) బీజేపీలో చేరారు. రామగుండం నుంచి టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోరుకంటి చందర్.. తిరిగి పార్టీలో చేరడంతో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా బీజేపీ గూటికి చేరుకున్నారు.
అసంతృప్తులపై బీజేపీ వల...
టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంత ర్గత పోరును అనుకూలంగా మలుచుకునేందుకు అసం తృప్త నేతలు లక్ష్యంగాబీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారంటూ బీజేపీ నేతలు పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ ఎమ్మెల్యే నివాసంలో ఇటీవల కొందరు టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలు సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సమావేశంలో తాము పాల్గొనలేదని, టీఆర్‌ఎస్‌పై విధేయత ప్రకటిస్తూ కొందరు నేతలు మంగళవారం ప్రకటనలు జారీ చేశారు. అయితే బీజేపీ మాత్రం తమతో కలసి వచ్చే టీఆర్‌ఎస్ కీలక నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తూ అసంతృప్త నేతలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అంతర్గత విభేదాలు మచ్చుకు కొన్ని..
- ముషీరాబాద్, నర్సాపూర్, హుస్నాబాద్, నల్లగొండ, భువనగిరి, నకిరేకల్, ఆలేరు, స్టేషన్ ఘన్‌పూర్, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పాత, కొత్త నాయకుల విభేదాలతో గ్రూపులు కొనసాగుతున్నాయి.
- ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల్లో తమ తర్వాత పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు దక్కడంపై అసంతృప్తితో రగలిపోతున్నారు.
- ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు వస్తాయనే ఆశతో ఉన్న మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులకు తాజా విస్తరణలో చోటు దక్కకపోవడంతో వారు అసంతృప్తి చెందుతున్నారు.
- డోర్నకల్, అచ్చంపేట, మేడ్చల్, భూపాలపల్లి వంటి నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలను పదవుల పంపకాలతో సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి.
- 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన 13 మంది ఎమ్మెల్యేలు తమ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాత, కొత్త నేతల నడుమ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment