
అల్లాదుర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంజీవరావు
అల్లాదుర్గం(మెదక్): పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితుడే తెలంగాణకు మొట్ట మొదటి సీఎం, దళితులు సాగు చేసుకునేందుకు మూడెకరాల భూమి ఇస్తాం అంటూ ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు సీఎం కేసీఆర్ ఇచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు ఆరోపించారు. మంగళవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తానని చెప్పినా ఏ గ్రామంలో అవి కనిపించక పోగా, నిరుపేదలు పూరిగుడిసెలలో నివసిస్తున్నారని చెప్పారు. దళితులకు మూడేకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న హామీ ఎక్కడ అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. పదవి కోసం తెలంగాణ యువతను బలి చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ భూమిలో నిర్మించిన రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పిన కేసీఆర్ ఆయనతో అదే ఫిలింసిటీలో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్, సామాజిక హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశయ్య, పద్మరావ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment