సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తారని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. గర్భిణులకు ప్రసవం అయ్యాక రూ.13 వేలు ఇచ్చే ఆర్థిక సహాయం అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకం సీఎం ఆలోచనల్లోంచి పుట్టినవేనని గుర్తు చేశారు. పొద్దంతా కూలి పని చేసుకుని సాయంత్రం ప్రసవించే పరిస్థితులను గమనించిన కేసీఆర్.. ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. భూమి వంటి, ఎలాంటి ఆధారం లేని నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే పూచీకత్తుపై సబ్సిడీ రుణాలు అందజేసి ఆదుకుంటున్నది టీఆర్‌ఎస్ సర్కారేనని పేర్కొన్నారు. ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్ తరాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ పాలన ఉంటుందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తామని, తద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు, రాష్ట్రంలో కల్తీ లేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని తెలిపారు.
జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం
జిల్లాలోని జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపామని కవిత పేర్కొన్నారు. ఇందుకోసం 800 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. విమానాశ్రయ నిర్మాణం జరిగితే వాణిజ్య, వ్యాపార పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రెండు దశాబ్దాల కాలంగా ముందుకు సాగని నిజామాబాద్ – పెద్దపల్లి రైల్వేలైను నిర్మాణం పూర్తి చేయించానని గుర్తు చేశారు. ముంబై, తిరుపతి వంటి ప్రాంతాలకు రైళ్ల సదుపాయాన్ని పెంచామని పేర్కొన్నారు. ఐదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఎంపీగా ఐదేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పని చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే సేవ చేస్తానన్నారు.
41(ఏ) సీఆర్‌పీసీని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా..
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమైందని, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో న్యాయవాదులు ముందున్నారని కవిత గుర్తుచేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే బెయిల్ మంజూరు చేసే 41 ఏ సీఆర్‌పీసీ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని హామీనిచ్చా రు. న్యాయవాదులకు హెల్త్‌కార్డుల మంజూరు అం శాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని చెప్పా రు. ఐదేళ్లలో తన పనితీరును పరిశీలించి ఎంపీగా మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.
కవితకు మద్దతు పలికిన రైతు అభ్యర్థి
పసుపుబోర్డు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఓ రైతు, అభ్యర్థి ఎంపీ కవితకు మద్దతు పలికారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన బొర్రన్న గురువారం జక్రాన్‌పల్లి సభకు హాజరై మద్దతిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment