
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రచారానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. గత ఎన్నికల తరహాలోనే కేసీఆర్ వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా ప్రచార షెడ్యూల్ ఖరారవుతోంది. ముందుగా ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించి... తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహించాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిం చాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది.
అక్టోబర్‌లోనే వీటిని పూర్తి చేయాలని మొదట అనుకున్నా, మహాకూటమిపై స్పష్టత రాకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేసింది. మూడు ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల తేదీలను రెండుమూడు రోజుల్లో ప్రకటించనున్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిరోజూ కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. కొన్ని రోజుల్లో నాలుగు సెగ్మెంట్లలో సైతం ప్రచారం చేసేలా ఈ షెడ్యూల్ ఉంది.
ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రచార నిర్వహణ షెడ్యూల్‌పై కేసీఆర్ పలువురు పార్టీ ముఖ్యనేతలతో మంగళవారం చర్చించారు. దశలవారీగా ప్రచారం నిర్వహించే నియోజకవర్గాల జాబితాను రూపొందించారు. మహాకూటమి లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గాలు, జిల్లా వారీగా ప్రచార సరళిలో మార్పులు ఉండాలని... స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే అంశాలను ప్రస్తావించాలని భావిస్తున్నారు.
హెలికాప్టర్, బస్సు...
ఎన్నికల ప్రచారంలో భాగంగా యాభై రోజుల్లో వంద నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు అసెంబ్లీ రద్దయిన రోజునే కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ మరుసటి రోజే హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి (మహబూబ్‌నగర్) ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకు నాలుగు సభలు పూర్తయ్యాయి. 107 అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించింది.
రాష్ట్రంలోని మొత్తం 119 సెగ్మెంట్లలో సగానికిపైగా టీఆర్‌ఎస్ అభ్యర్థులతో ఏకపక్షంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మహాకూటమి అభ్యర్థులపై స్పష్టత వచ్చాకే పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. గత ఎన్నికల తరహాలోనే ఎక్కువ సభలకు హెలికాప్టర్‌లోనే వెళ్లనున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ వంటి నగరాలతోపాటు దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో రోడ్డు షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నగర ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ మంది బహిరంగ సభలకు రావడానికి విముఖంగా ఉంటారు.
ఈ నేపథ్యంలో బస్సులో రోడ్‌షోలతో ఉపయోగం ఉంటుందనే అంచనాకు వచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత ప్రచారం కోసం ప్రత్యేకంగా బస్సును రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ బస్సు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఈ ప్రత్యేక బస్సును పరిశీలించారు. మంగళవారం ఈ బస్సును కేసీఆర్ పరిశీలనకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రచార షెడ్యూల్‌కు అనుగుణంగా హెలికాప్టర్, బస్సును సిద్ధం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment