సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)కు ఏర్పడిన అనుకూల పరిస్థితులు... కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నుంచి కొనసాగుతున్న వలసలు... టికెట్ ఇస్తే చాలు గెలుపు ఖాయమన్న నమ్మకం... వెరసి జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా పరిషత్ ఎన్నికల సంరంభం సోమవారం నామినేషన్లతో మొదలు కాగా... రిజర్వేషన్ల ప్రకారం జిల్లా పరిషత్ పీఠంపై కన్నేసిన నేతలు పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారితో పాటు ఓటమి చెందిన వారు జిల్లా పరిషత్ పీఠంపై గురి పెట్టారు. ఇక మరికొందరు సీనియర్ నాయకులు తమ వారసులు, కుటుంబసభ్యులను బరిలో దింపేందుకు చక్రం తిప్పుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఆశావహులు, పోటీతో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.
ఆరు జిల్లాల్లో అదే పరిస్థితి
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే ఆ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం కూడా చేశారు. దీంతో గెలుపు తధ్యమని భావిస్తున్న పలువురు జెడ్పీటీసీ టికెట్లు ఆశిస్తుండగా... మరికొందరు నేతలు చైర్మన్ గిరీపై గురి పెట్టి ముందుకు సాగుతున్నారు. ఇంకొందరు వారసులు, కుటుంబసభ్యులు, బంధువులను జెడ్పీ పీఠం ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా.. ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎంపిక, గెలిపించే విషయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేకే సీఎం కేసీఆర్ పూర్తిగా అవకాశం ఇవ్వగా.. ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గ్యాదరి బాలమల్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇన్‌చార్జిలుగా ప్రకటించారు. అయితే, టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ల జాబితా వెల్లడించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎవరెవరంటే..
ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేసిన వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ పడతున్నా... సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అనుచరుడు, కరీంనగర్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఎంపీ వినోద్‌కుమార్ కూడా ఎల్కతుర్తిలో ఆయనకు హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన డాక్టర్ సుధీర్‌ను ఎస్సీకి రిజర్వు చేసిన ఎల్కతుర్తి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయించాలని భావించగా, ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇప్పించేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన సతీమణి పెద్ది స్వప్న కోసం మార్గం సుగమం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా కిందకు వచ్చే ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతోనే కాకుండా అధిష్టానంతోనూ ఓకే అనిపించుకున్నారు. అయితే కాంగ్రెస్ నేత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి సోమవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. గండ్ర జ్యోతికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తామనే హామీ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ నుంచి వచ్చినట్లు తెలుస్తుండడంతో ఈ సీటుపై సందిగ్ధం నెలకొంది.
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా కుసుమ జగదీశ్ పేరు ప్రకటించగా, మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ఆజ్మీరా ప్రహ్లాద్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ములుగు జెడ్పీ అన్ రిజర్వుడ్ అయినా ప్రహ్లాద్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్‌పదవి కోసం టీఆర్‌ఎస్ నుంచి కమలాపూర్‌కు చెందిన భార్గవ్ సతీమణి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ ఉద్యోగుల సరోజన, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తీవ్రస్థాయిలో ఎవరికీ వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కోసం టీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా తమ అనుకూలురను బరిలో దింపి పీఠం దక్కించుకోవటానికి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ప్రధానంగా రెడ్యా నాయక్ కోడలు నిత్య రవిచంద్ర పేరు వినపడుతోంది. అలాగే ఎంపీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్ మహిళా విభాగం మాజీ జిల్లా అధ్యక్షురాలు సుచిత్ర, 2014 లో డోర్నకల్ ఎమ్మెల్యేగా వైస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన సుజాత మంగీలాల్, అనిత నెహ్రూ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జనగామ జెడ్పీ చైర్‌పర్సన్ పదవి అధికార టీఆర్‌ఎస్ నుంచి పలువురు పోటీలో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కోసం అధిష్టానంతో మాట్లాడినట్లు చెబుతున్నారు. గతంలో ఆమె అసెంబ్లీ టికెట్ ఆశించి అధిష్టాన సూచన మేరకు విరమించుకున్నారు. జనగామ స్థానం జనరల్‌కు రిజర్వ్ కావడంతో అదే పార్టీ నుంచి గుడి వంశీధర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, ఎన్.సుధాకర్‌రావు పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment