ప్రధాని మోదీకి కేసీఆర్‌ 10 వినతులు | KCR Meets PM Modi Made 10 Requests | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి కేసీఆర్‌ 10 వినతులు

Published Fri, Jun 15 2018 2:53 PM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

KCR Meets PM Modi Made 10 Requests - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం(బైసన్‌ పోలో గ్రౌండ్‌) కేటాయింపు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్‌కు నిధులు, కరీంనగర్‌లో ఐఐఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై ప్రధానమంత్రికి సీఎం వినతి పత్రాలు సమర్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. వాటిలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.

1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు రూ. 25 వేల కోట్లతో పాటు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ. 22 వేల కోట్ల రుణం కూడా పొందాం. ఇంకా నిధుల అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి, రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించగలరని కోరుతున్నాను.

2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాల నియామకానికి సంబంధించి పాత జోనల్ విధానమే కొనసాగుతున్నది. ఆర్టికల్ 371డి ఇంకా అమలవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6 జోన్ల వ్యవస్థ ఉండేది. తెలంగాణలో 5, 6 జోన్లు ఉన్నాయి. మిగతావి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం కల్పించడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం.

కాబట్టి, జోనల్ వ్యవస్థలో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాబట్టి దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించగలరని మనవి చేస్తున్నాను.

3. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల విభజన పూర్తయినా, హైకోర్టు విభజన మాత్రం పూర్తి కాలేదు. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్నది.

తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు తమ హైకోర్టు తమకుండాలని బలంగా కోరుకుంటున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడి న్యాయవాదులు కూడా తమ హైకోర్టు తమకు కావాలని కోరుకుంటున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా హైకోర్టు విభజన పూర్తి చేస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారు. కానీ ఇంకా అమలు కాలేదు.

హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే, అందులో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణకు చెందిన వారున్నారు. 60:40 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ న్యాయమూర్తులు ఉండాల్సివుండగా, అదీ అమలు కాలేదు. కాబట్టి మీరు జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేలా చూడగలరు.

4. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే లైన్లు జాతీయ సగటు కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయగలరు. అక్కన్నపేట్-మెదక్ రైల్వే లైను నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం.

భద్రాచలం రోడ్-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మించాలని కోరుతున్నాం. కాజీపేట-విజయవాడల మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం-మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలని మనవి చేస్తున్నాం. సికింద్రాబాద్-మహబూబ్ నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వే లైన్లను డబుల్ లేన్‌గా మార్చడానికి, హుజురాబాద్ మీదుగా కాజీపేట-కరీంనగర్ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించగలరని మనవి చేస్తున్నాను.


5. హైదరాబాద్‌లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను కోరాం. ఆ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించగలరు. 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు స్టేట్ హైవే విస్తరించడానికి అనుగుణంగా రక్షణ శాఖ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.

ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుంది. ఈ మూడు ప్రాంతాల్లోని రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా మనవి చేస్తున్నాను.

6. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల(ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాల్సివుంది. కానీ, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదు. ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయగలరని మనవి చేస్తున్నాను.

7. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)ను మంజూరు చేయగలరు.  

8. కేంద్ర ప్రభుత్వం 2013 సంవత్సరంలో హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజన్(ఐటిఐఆర్) మంజూరు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను కూడా సమర్పించింది. కానీ హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల్లో చదివాం.

ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు చేయూత అందించగలరని కోరుతున్నాను.

9. కరీంనగర్ పట్టణంలో ఐఐఐటిని స్థాపించండి. దీనికి సంబంధించి స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయి. వరంగల్‌లో నిట్ ఉంది. కరీంనగర్ నగరంలో ఐఐఐటి స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింత బాగా విస్తరించినట్లవుతుంది.

10. ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుంది. తెలంగాణలో ఇటీవలే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. రంగారెడ్డి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్ధిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం నవోదయ విద్యాలయాలున్నాయి.

మిగతా జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పగలరు. ఈ విద్యాలయాలకు కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement