ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలి. తూ కిత్తా, మై కిత్తా అని తిట్టుకుంటూ ప్రపంచ దేశాల్లో నగుబాటయ్యే పార్టీలు దేశానికి అక్కర్లేదు. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాలి. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో మాట్లాడిన. ఎక్కడో ఒక దగ్గర.. ఎవరో ఒకరు తెగించకపోతే ఏమీ సాధ్యం కాదు.
టీఆర్‌ఎస్ పెట్టినప్పుడు బక్క మనిషితో ఏమైతదని మాట్లాడిన్రు. తేలిగ్గ తీసిపారేసిన్రు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని చంద్రబాబు హేళన చేసిండు. ఏం చేసిన నేనే కర్త, కర్మ అని విర్రవీగిండు. 3 నెలల నుంచి అక్కడ ఏం జరుగుతుందో మీరే చూస్తున్నరు. నేను ఆయనను ఆంధ్రలో ఓడిస్తనని చంద్రబాబు భయపడుతున్నడు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల అనంతరం సంభవించే పరిణామాలను చూసి అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక పాత్ర పోషిస్తానని సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పోరాటాల గడ్డ, కలిసివచ్చిన కరీంనగర్ నుంచే ఈ మాట చెప్పేందుకు వచ్చానని పేర్కొన్నారు. ‘ప్రజలు ఆశీర్వదించి.. 16 సీట్లిస్తే ఢిల్లీలో అగ్గిరాజేస్త’అని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారభేరి మోగించేందుకు ఆదివారం కరీంనగర్ వచ్చిన కేసీఆర్.. ఇక్కడి స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే విషయాన్ని విస్పష్టంగా వెల్లడించారు. ‘ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలి. తూ కిత్తా, మై కిత్తా అని తిట్టుకుంటూ ప్రపంచదేశాల్లో నగుబాటు అయ్యే పార్టీలు దేశానికి అక్కర్లేదు. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాలి.
ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో మాట్లాడిన. ఎక్కడో ఒకదగ్గర.. ఎవరో ఒకరు తెగించకపోతే ఏమీ సాధ్యం కాదు. తెలంగాణ జెండా పట్టుకున్న నాడు ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నా. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన. సాధించిన తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన. ఇయ్యాల తెలంగాణ రాకపోతే పేదోడి పరిస్థితి ఏమయ్యేది? నీళ్లు వచ్చేవా? 24 గంటల కరెంట్ వచ్చేదా? దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చెయ్యాలె. తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి, దిక్సూచి కావాలె. దేశంలో ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దాని కోసం మీ ఆశీర్వాదం కావాలి’అని ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వెళ్లమంటారా.. జాతీయ రాజకీయాల్లోకి? అని ప్రజలను ప్రశ్నిస్తూ.. వెళ్లమనే వారు చేతులెత్తాలని కోరారు. దీంతో సభకు హాజరైన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు నిలబడి పీఎం కేసీఆర్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ సంఘీభావం తెలిపారు. వేదికపై ఉన్న నేతలు సైతం నిలబడి తమ మద్దతు ప్రకటించారు.
దేశ దుస్థితికి కారణం వారిద్దరే!
దేశానికి దారుణ గతి పట్టించింది కాంగ్రెస్, బీజేపీలేనని కేసీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభిస్తున్నా.. దేశం మొత్తంలో 40 కోట్ల ఎకరాల సాగుకు అవసరమైన 40వేల టీఎంసీల నీరు ఇవ్వలేని దుస్థితికి కారణం ఈ పార్టీలేనన్నారు. కృష్ణా నీటి పంపకాలపై 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు నెలల్లో తీర్చాల్సిన నీళ్ల పంచాయతీని 15 ఏళ్లైనా తేల్చలేదన్నారు. దేశంలో 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్ స్థాపితశక్తి ఉండగా, అందులో బొగ్గు, అణువిద్యుత్ ద్వారానే 2.60 లక్షల మెగావాట్లు లభిస్తోందని చెప్పారు. దేశంలో నాలుగో వంతు జనాభా ఉన్న అమెరికాలో 10లక్షల స్థాపిత విద్యుత్ ఉంటే చైనాలో 9లక్షలకు పైగా ఉందని లెక్కలతో సహా వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో 37వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. ఈ బాధ దేశానికి పోవాలని, కాంగ్రెస్, బీజేపీలతో అది సాధ్యం కాదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాలకు హక్కులు రావాలని, ఎక్కడో మల్హర్ మండలంలో కూలి పని చేస్తే ఢిల్లీ నుంచి పైసలిచ్చే పద్ధతి మారాలన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. రోడ్లు వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కావాలా అని ఎద్దేవా చేశారు. దేశంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసని ఆయన ధ్వజమెత్తారు. ‘తలసరి విద్యుత్ వినియోగం, ఆదాయవృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీకి ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. పరిపాలన చేయరాదని ఎవరైతే అన్నారో.. వాళ్లకు వెయ్యి రెట్లు మెరుగ్గా పనిచేస్తున్నాం. 2014–15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే.. నేడు 54 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తున్నాం. దశాబ్దాలుగా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేరా? వారి హయాంలో పనులు జరగలేదు. రాష్ట్ర విభజన జరిగితే మీకు పరిపాలన చేతగాదన్నారు. కానీ వారికన్నా మెరుగ్గా.. తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతున్నది ’అని సీఎం కేసీఆర్ వివరించారు.
3నెలల నుంచి బాబు భయపడుతున్నడు
‘తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పెట్టినప్పుడు బక్క మనిషితో ఏమైతదని మాట్లాడిన్రు. తేలిగ్గ తీసిపారే సిన్రు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని చంద్రబాబు హేళన చేసిండు. ఏం చేసిన నేనే కర్త, కర్మ అని విర్రవీగిండు. 3నెలల నుంచి అక్కడ ఏం జరుగుతుందో మీరే చూస్తున్నరు. నేను ఆయనను ఆంధ్రల ఓడిస్తనని చంద్రబాబు భయపడుతున్నడు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో జాతీయ పార్టీలు ఎక్కడున్నాయని ఎద్దేవా చేసిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. సభకు వచ్చిన ప్రజానీకం సభా ప్రాంగణంతో పాటు మానేర్‌డ్యాం కట్టపైన కూడా కూర్చొని వినడం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంతో నాలుగు సజీవనదులు
‘దేశంలో ఒకప్పుడు ప్రాజెక్టు కట్టాలంటే 30, 40 ఏండ్లు పట్టేది. 40 ఏండ్ల కిందటి ఎల్‌ఎండీ (లోయర్ మానేర్ డ్యాం) ఇంక కొసముట్టలే. వరంగల్, డోర్నకల్, మహబూబాబాద్ పనులు ఇంక జరుగుతున్నయ్. నల్గొండకు ఇంక రాలె. కానీ.. కాళేశ్వరం నాలుగేండ్లల్ల చివరి దశకు చేరుకుంది. జూలై, ఆగస్టు కల్లా పనులు పూర్తయితయ్. ఈ కాళేశ్వరం వల్ల నాలుగు నదులు సజీవకళను సంతరించుకుంటాయి. 180 కిలోమీటర్ల మానేరు నది 365 రోజులు నీళ్లతోనే కళకళలాడుద్ది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం కింద 124 కిలోమీటర్లు ఎస్సారెస్పీ కాలువ నిత్యం నీటితో ఏడాది పొడవునా ప్రవహిస్తది. కరీంనగర్, వరంగల్, నల్లగొండలకు నీళ్లిచే కాకతీయ కాలువ సైతం సజీవంగానె ఉంటది. ఇక గోదావరి నది 250 కిలోమీటర్ల పొడవునా సజీవంగా ప్రవహిస్తది. తుపాకులగూడెం నుంచి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి నుంచి సబర్మత్ వరకు నీరు నిత్యం నిండిపోయి ఉంటాయి. ఎండిన గోదావరి ఇక మనకు కనిపించదు. 365 రోజులు నిండే ఉంటది. ఇవన్నీ సంకల్పంతోనే సాధ్యమైనవి’అని కేసీఆర్ వివరించారు.
నేను చేసినన్ని యాగాలు దేశంలో ఎవ్వడు చెయ్యలె!
‘బీజేపీ నేతలు మాత్రమే హిందువులు అయినట్లు మాట్లాడుతున్నారు. మేం హిందువులం కామా? గుళ్లకు, చావులకు పోమా? ఎములాడ, కాళేశ్వరం పోతలేమా? మాట్లాడితే హిందువు అనే మతం పేరు ఎందుకు? నేను చేసినన్ని యాగాలు దేశంల ఎవ్వడు చెయ్యలే. నేను పూజలు చేస్తే వాళ్లకు బాధ ఎందుకు? నన్ను విమర్శిస్తున్నారు’అని బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. భారత్ పరువు పోయేలా మోదీ, రాహుల్‌గాంధీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘దేశ ప్రధాని దొంగ అని రాహుల్ గాంధీ విమర్శిస్తారు.. తాను జామీను ఇస్తేనే తల్లీ కొడుకులు దేశంలో తిరుగుతున్నారని నరేంద్ర మోదీ విమర్శిస్తున్నారు. ఇలా ఒకరిని ఒకరు తిట్టుకొని చేసే పాలన ఎంతకాలం’అని ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్ వెనుక నడిచేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా లేవన్నారు. దేశంలో సమస్యలు పోవాలంటే సమాఖ్య ప్రభుత్వం రావాలని చెప్పారు. 16 ఎంపీ సీట్లతో ఏం సాధిస్తానని వెటకారం చేస్తున్నారని.. తాము ఏం చేయబోతున్నామో ఎన్నికల తర్వాత తెలుస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
16 మంది ఎంపీలను గెలిపిస్తే అగ్గిరాజేస్త
‘16 మంది ఎంపీలను గెలిపిస్తే.. ఏం చేస్తవని కొందరు అంటున్నరు. 20 ఏండ్ల కిందట అన్నరు ఏడ తెత్తవు తెలంగాణ అని. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన. దేశంల అప్పుడే నూరు నూటిరవై మందిని జమకట్టిన. వాళ్లకేం నూరిపొయ్యాల్నో పోసిన. 16 ఎంపీలను గెలిపిస్తే అగ్గిరాజేస్తా. ఎవడో ఒగడు మొగోడు పుట్టాలె. ఎక్కడో ఓ కాడ పొలికేక రావాలె. 18 రాష్ట్రాల్లో భయంకర కరెంటు కోత ఉంది. పెనుమార్పులు రావాలి. కొత్త భారతదేశం ఆవిష్కృతం కావాలి’అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment