సాక్షి, కొంగరకలాన్ : ప్రపంచం నిబ్బర పోయే విధంగా జనమా ప్రభంజనమా అనుకునే విధంగా ప్రజలు ప్రగతి నివేదన సభకు తరలి వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సభను చూస్తూ ఉంటే 2001 నాటి జ్ఞాపకాలు తన కళ్ల ముందు తిరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలో కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే..
నాడు బహిరంగ లేఖ ద్వారా..
‘ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడా పెడా కరెంట్ చార్జీలు పెంచితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓ తెలంగాణ బిడ్డగా బహిరంగ లేఖ ద్వారా మీరు పెంచిన కరెంట్ బిల్లులు ఉరితాళ్ల వంటివని చెప్పాను. మీరు అలా మొండిగా అదే పద్దతిలో వెళ్తే మా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తానని చెప్పాను. వలస పాలనలో ఎక్కువ మాట్లాడితే కాల్చిపారేద్దం అనే ధోరిణిలో నాడు సమైక్య పాలకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతిలో ఉందనే మదంతో కళ్లు మూసుకుపోయిన నాటి ప్రభుత్వానికి నా మాటలు వినపడలేదు. నేను రాసిన ఈ బహిరంగ లేఖతోనే నాడు ఉద్యమానికి బీజం పడింది. 9 నెలల పాటు ఏం చేయలేని పరిస్థితి. ఎక్కని కొండలేదు. మొక్కని బండ లేదు. కొన్ని వేల మందితో ఆరు ఏడు నెలల పాటు విపరీతంగా ప్రయత్నించాను. లాభం లేదు తెలంగాణ రావాల్సిందేనని, ధర్మం, న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందని, అహింస మార్గంలో ఉద్యమం చేపట్టాలని భావించి నాడు ఆ బాట పట్టాం.
ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం..
ఆ ఉద్యమంలో మీరందరూ కూడా పాత్రదారులే. ఎన్నో రాజీనామాలు, ధర్నాలతో ప్రభంజనం సృష్టించినం. మొదట హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అహంకారంతో ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసింది. మనల్ని ఘోరంగా అవమానించారు. ఎక్కడిదయ్యా తెలంగాణ అని మాట్లాడారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న ఎంపీ వినోద్.. ఒకరోజు మిత్రుడు చిన్న మల్లయ్య ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమైతుంది ఈ పోరాటం ఎక్కడి వరకు పోతుంది అని అడిగారు. మనకున్న సిన్సియారిటీపై ఆధారపడుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చిన కొనసాగించగలిగితే విజయం సాధించవచ్చని నాడు చెప్పా. 2001, ఎప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను. ఒకవేళ దింపితే రాళ్లతో కొట్టండి అని చెప్పాను.
నేను తెలంగాణ పిచ్చోడిని..
ఢిల్లీలో నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం 36 పార్టీలను ఒకటికి 20 సార్లు కలిసాను. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్‌ను ఒప్పించడానికి 38 సార్లు వెళ్లాను. ఆయన నీకేమైన పిచ్చా అని అడిగారు. అవును నాకు తెలంగాణ పిచ్చి అని సమాధానమిస్తే మద్దతు ఇస్తానని తెలిపారు. 36 పార్టీల మద్దతు కూడగట్టి అనేక పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. వెంటనే ఎన్నికలకు పోయే పరిస్థితి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. పార్టీ మిత్రులంతా ఇతరులకు అప్పగించవద్దని ఒంటరిగా పోటీ చేద్దామని తెలిపారు. ప్రజలు మద్దతు ఇచ్చి దీవించి టీఆర్‌ఎస్ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని సంపూర్ణ మెజార్టీతో తెలంగాణను బాగుచేయమని చెప్పడం జరిగింది.
నాడు పుట్టిన ఆలోచననే..
కొత్త రాష్ట్రం.. ఆర్థిక పరిస్థితి ఎంటో తెలియదు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల వరకు విపత్కరమైన పరిస్థితి. మహూబూబ్‌నగర్ నుంచి 15 లక్షల వలసలు, అన్ని కష్టాలను అర్థం చేసుకొని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాం. తెలంగాణ రాక ముందు ఢిల్లీలో ఒక రోజు విద్యాసాగర్ రావు, జయశంకర్ సార్ నేను తెలంగాణ వస్తది వస్తే ఏం చేయాలని చర్చ చేశాం. నేను చెబుతున్నా కొద్ది జయశంకర్ సర్ రాస్తున్నాడు. ఆ నాడు భూగర్భ జలాలు అడుగంటాయని, చెరువుల్లో సామర్థ్యం పోయిందని చెప్పాను. తెలంగాణ రాగానే చేపట్టిన మిషన్ కాకతీయ ఆ నాటి మా చర్చలో నుంచి పుట్టిందే. కరెంట్ బాధలు పోవాలి, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఓ ముఖ్యమంత్రి చెప్పిండు. చిమ్మన చీకటి అయితది అని చెప్పిన స్థితి నుంచి ఈ రోజు 24 గంటలు వెలిగేలా.. భారత్‌లో రైతులకు 24 గంటలిచ్చే రాష్ట్రం తెలంగాణే అని చెప్పేలా చేశాం. భవిష్యత్తులో ఒక రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను.
ఆ రాతలు చూసి ఏడ్చా..
సమైక్యపాలనలో కుల వృత్తుల నిర్వీర్యమయ్యాయి. కరీంనగర్ పర్యటనలో ఒక రోజు సిరిసిల్లా ప్రజలు ఆత్మహత్య చేసుకోవద్దని రాతలు చూసి ఏడ్చాను. పోచంపల్లిలో చేనేత కార్మికులు ఒకే రోజు 7గురు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ముఖ్యమంత్రి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వమంటే ఇవ్వలేదు. మేం జోల పట్టి ఇస్తానని చెప్పి ఇచ్చాం. సిరిసిల్లాలో 11 మంది చనిపోతే టీఆర్‌ఎస్ తరపున సాయం అందజేశాం. ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ వస్తే మన బాధలు తీరుతాయని చెప్పా. ఇప్పుడు బతుకమ్మ చీరలు, రంజాన్‌కు పేదలకు ఇచ్చే దుస్తులతో వారికి పనిఇచ్చి ఆదుకుంటున్నాం. చీప్ లిక్కర్ వల్ల గీతకార్మికులు నష్టపోతే వాటిని రూపుమాపి ఆదుకున్నాం. వారికి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం. 70 లక్షల గొర్రెలు ఇచ్చాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో యాదవులకు మేలు జరిగింది. 2లక్షల 11 వేల పాడిరైతులకు సబ్సిడీ అందజేశాం.
ఆయన గోస చూడలేక..
ఉద్యమ సమయంలో మంత్రి చందులాల్‌తో ములుగుకు వెళ్లి వస్తుంటే ఓ ఇళ్లు కాలిపోయిది. ఆ ఇంటి చెందిన ఇమానాయక్ ఏడుస్తున్నాడు. ఏమయిందయ్యా అంటే బిడ్డ పెళ్లి కోసం తెచ్చిన రూ. 50 వేలు కాలిపోయినాయని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయనకు లక్ష రూపాయలు ఇస్తానని, పెళ్లికి వస్తానని చెప్పి ఆ పెళ్లికి కూడా వెళ్లడం జరిగింది. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎంతో మంది పేదలకు పెళ్లి చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే కళ్యాణి లక్ష్మీ పథకం చేపట్టాం. దీంతో బాల్యవివాహాలు తగ్గాయి. ఎంతో మంది తల్లి తండ్రులకు సాయంగా ఉంది. ఎలక్షన్ మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం.
ఐదున్నర వేల కోట్లు కేటాయించాం..
తెలంగాణ ప్రభుత్వ ఏర్పడిన తరువాత నాయి బ్రాహ్మణులకు భరోసా కల్పించాం. పేద బిడ్డల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. రానున్న రోజుల్లో కేజీ టూ పీజీ ఉచిత విద్యా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గిరిజనులు, లంబాడ ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. దీంతో మూడువేల గిరిజన బిడ్డలు సర్పంచులుగా ఎన్నికకానున్నారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. రాష్ట్రంలో అప్పులేని రైతు లేడు. వారందరిని ఆదుకునేందుకు రైతుబంధు పథకం ప్రవేశపెట్టాం. రైతులకు ప్రభుత్వమే అప్పు చెల్లించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది. దాని కోసం ఏకంగా ఐదున్నర వేల కోట్ల రూపాయాలను కేటాయిచాం. రెండో విడత రైతుబంధు చెక్కులను నవంబర్‌లో విడుదల చేస్తాం. రైతులు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుభీమా పథకం అమలు చేస్తున్నాం.
11 రాష్ట్రాలు అభినందించాయి..
ఇంటింటికి త్రాగు నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని దేశంలో ఇంతవరకూ ఏ ఒక్క సీఎం కూడా ప్రకటించలేదు. అలా ప్రకటించింది కేసీఆర్ ఒక్కడే. దానికి అనుగుణంగానే మరో ఆరు నెలల్లో ఇంటింటికి నీరు అందిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పథకాన్ని 11 రాష్ట్రాల అధికారులు వచ్చి పరిశీలించారు. తెలంగాణలో మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మనం తీసుకున్న శ్రద్ద దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా తీసుకోలేదు. దేశంలోని ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయించింది. ముందస్తు ఎన్నికలపై గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటోందో అది చేయండని మంత్రివర్గ సహాచరులు నాకు అప్పగించారు.
ముందస్తు ఎన్నికలపై తరువాత..
ముందస్తు ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకుంటాం. దీనికొరకు త్వరలో కేకే అధ్యక్షతన పార్టీ మ్యానిఫేస్టో రూపొందిస్తాం. దానిలో మరిన్ని కొత్త పథకాలను పొందుపరుస్తాం. తెలంగాణ వచ్చిన రోజు నేనెంత సంతోష పడ్డానో.. కొత్త జోన్లకు కేంద్ర ఆమోదం తెలిపిన తరువాత అంత సంతోష పడ్డా. స్థానికులైన నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు రావాలని ప్రధాని మోదీతో కొట్లాడి మరీ ఒప్పించాను. కేసీఆర్ లేకపోతే ఇది సాధ్యమేనా మీరే ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని మూకలు, ప్రగతి నిరోధక శక్తులు అడ్డుపడుతున్నాయి. ప్రాజెక్టులు కట్టుకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అది దిక్కుమాలిన చర్య. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో ముందుకు తీసుకెళ్దాం. కొన్ని పార్టీలు ఢిల్లీకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఢిల్లీకి చెంచాగిరి చేసే అవసరం మనకు లేదు. తమిళనాడు ప్రజలు ఏలానైతే ఇతర పార్టీలను రానివ్వకుండా ఆత్మగౌరవంతో ముందుకువెళ్తున్నాయో అలానే మనం కుడా కొనసాగుదాం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment