బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారపార్టీ టీఆర్‌ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నేతలతోపాటు కార్యకర్తల్లోనూ టెన్షన్ కొనసాగుతోంది. మొహర్రం, వినాయక నిమజ్జనం తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం కూడా ఎలాంటి జాబితా వెలువడలేదు. టికెట్ రేసులో ప్రధానంగా మాజీ మంత్రి దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్యనే కొనసాగుతోంది. రేసులో వీరిద్దరే నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.
ఇక కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తామే పోటీ చేస్తామని టీడీపీ బల్లగుద్ది చెబుతుండగా తామే పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ ధీమాగా ఉంది. నియోజకవర్గాన్ని తమకే కేటాయించాలంటూ రెండు పార్టీలు పట్టుపట్టి కూర్చున్నాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించారంటూ ఓ పేరు వాట్సప్‌లో వైరల్ అవుతుండగా ఇంకా పొత్తు కుదరలేదని అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ టీడీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డి చాపకింద నీరులా ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థి ఎవరో తేలక చోద్యం చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment