సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అమరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను రాజకీయాల నుంచి తప్పిస్తేనే సాధించుకున్న రాష్ట్రానికి సార్థకత చేకూరుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా వ్యాఖ్యానించారు. అందుకోసం ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదం తో ప్రతీ కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించిన ‘జనగర్జన’ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
ఆ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్ హామీ నెరవేరలేదని, కానీ, వారి ఇంట్లో అందరికీ పదవులు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. దేశంలోనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయన్నారు. బుధవారం ఒక్క రోజే కరీంనగర్ జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయన్నారు. దేశం లో మోదీ–అమిత్‌షాను ఢీకొనగలిగిన సత్తా ఉన్న నాయకుడు రాహుల్‌గాంధీ ఒక్కరేనన్నారు. అందుకు నిదర్శనం గుజరాత్ ఎన్నికల ఫలితాలేనని చెప్పారు. 22 ఏళ్లుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా 80 స్థానాలు సాధించటం రాహుల్ గొప్పతనమేనని కుంతియా అన్నారు.
అంతా గోబెల్స్ ప్రచారం: ఉత్తమ్
ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేస్తున్నది గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ చెప్పుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దోపిడీ పాలన సాగుతోందన్నారు. విద్యుత్ విషయంలో ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిటైనా ప్రారంభించారా? అని ప్రశ్నించారు. జైపూర్ వద్ద 12 వందల మెగావాట్ల ప్లాంట్, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు కాంగ్రెస్ హయాంలోనివేనన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండటానికి కారణం కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల వల్లే సాధ్యమైందన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించకుండా లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టారని ఆరోపించారు.
ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రస్తుతం అదే ఆశయం కోసం మరో దఫా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆత్మగౌరవం దొరగడీల్లో బందీగా మారిందన్నారు. రాష్ట్రానికి వస్తున్న రాబడిని సీఎం కేసీఆర్ తన సొంత కుటుంబ విలాసాలకు వాడు కుంటున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని.. అందుకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సభలో మండలి విపక్షనేత షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీకృష్ణ, నేతలు వీహెచ్, అనిల్‌కుమార్ యాదవ్, శ్రావణ్‌కుమార్, మల్లు రవి తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment