హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజల్లోకి చేరనివ్వకుండా ఆయన కుటుంబ సభ్యులు దాని స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. నోరు జారి మాట్లాడారన్న ఎంపీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తూనే.. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా, ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం లభిస్తోందంటూ శాసన సభలో పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయలను వాడు, వీడు అంటూ వ్యాఖ్యానించడం కేసీఆర్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో లబ్ధిపొందుతూ రాష్ట్ర పథకాలుగా మార్చి వాటికి కేసీఆర్ కిట్ అంటూ నామకరణం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌దని నిప్పులు చెరిగారు.
రైతాంగానికి బీజేపీ ఏమి చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం చేయూతను ఇచ్చినట్లు వివరించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మీ చేతగాని తనాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. రైతుల రుణమాఫీ ఎందుకు పూర్తిగా చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.
బీజేపీని ఒవైసీ అంతం చేస్తాడట!
దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోందని దాన్ని అంతం చేయడం ఎంఐఎం నేత అసదుద్దీన్ తరం కాదన్నారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్లుగా ఒవైసీ ప్రవర్తన ఉందన్నారు. సికింద్రాబాద్‌లో పాగా వేస్తాం.. అంబర్‌పేటలో గెలుస్తామంటూ గతంలో అసదుద్దీన్ అనేకమార్లు సవాల్ విసిరారని, ఎక్కడా గెలువలేకపోయారన్నారు. ఒవైసీకి దమ్మూ ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లోనూ బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒవైసీ సోదరులు ఎలా చెప్తే కేసీఆర్ అలా నడుచుకుంటున్నారన్నారు. ఒవైసీ,
కేసీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment