సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేనందునే గత ఐదేళ్లలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ ఉన్నందున ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం సాయంత్రం ఏపీ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టి సందర్భంగా వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌పై కేంద్ర నిర్ణయాలు, పార్లమెంటు సమావేశాల్లో హోంశాఖ పనితీరు, తన శాఖ పనితీరుపై పలు వివరాలను మీడియాతో పంచుకు న్నారు.
‘నా విభాగానికి సంబంధించి కీలక బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. ఎన్‌ఐఏ చట్ట సవరణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఇందులో కీలకమైనవి’అని ఆయన తెలిపారు. కశ్మీరీ ప్రజల ప్రమేయం లేకుండా చేశారు కదా.. ప్రశ్నించగా ‘ప్రజలకు మేలు జరుగుతుందనే చేశాం. ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నప్పుడు మిమ్మల్ని అడిగి చేశామా? ఢిల్లీ ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మెట్రో సౌకర్యం అందుబాటులోకి వస్తోంది.
అవన్నీ మిమ్మల్ని అడిగే చేశారా? మేం ముందే మేనిఫెస్టోలో పెట్టాం. ఆ దిశగా అమలు చేశాం. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, మరికొన్ని పక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతు పలికాయి. కశ్మీరీ ప్రజలు కూడా తప్పకుండా స్వాగతిస్తారన్న విశ్వాసం ఉంది’అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మూకశ్మీ ర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించడం కేవలం తాత్కాలికమే అని, శాంతిభద్రతల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు.
డీలిమిటేషన్‌పై తుది నిర్ణయం కాలేదు
‘జమ్మూకశ్మీర్‌లో 1976 తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. కానీ మిగిలిన చోట్ల 2008లో జరిగింది. జమ్మూకశ్మీర్‌కు ఏపీ, తెలంగాణలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్వభజనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా
‘మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టాను. గతంలో శాసనసభలో ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నాను. జవాబు చెప్పే వ్యక్తిగా ఉండడం ఇదే తొలిసారి. నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. హోంశాఖలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నాకు ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నా. మన తెలుగువాడు అనిపించే విధంగా పనిచేస్తాను’అని పేర్కొన్నారు.
పార్టీ తరపున సెప్టెంబర్17న ఉత్సవాలు
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ తరఫున తెలంగాణవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఈమేరకు అన్ని శాఖలకు సూచనలు జారీ అయ్యాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment