సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిజాం, మజ్లిస్... కేసీఆర్ పొడగ్తల సమావేశాలుగా మారాయని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... నిజాంను పొగడటం, నిజాంకు అన్యాయం జరిగినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటం పట్ల ప్రజలు, స్వాతంత్ర్యసమరయోధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కాస్తా.. మజ్లీస్ పార్టీ తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లీస్ పార్టీ ఏది చెప్తే కేసీఆర్ అదే చేస్తున్నారని అన్నారు.
తెలంగాణను మజ్లిస్ పార్టీకి కేసీఆర్ ధారాదత్తం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిజాం బంగారం గురించి చరిత్రలో ఎక్కడా లేదని అన్నారు. తెలంగాణ, భారత్‌లో విలీనం కావటం తప్పు అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణలో వందలాది మంది చనిపోయారని, వాళ్ల పోరాటాలు తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్రను తప్పుగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కాశిం రజ్వి పెట్టిన పార్టీనే మజ్లీస్ అని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని, దరిద్రానికి మాటలు ఎక్కువ, తద్దినానికి కూరలు ఎక్కువ అన్నట్లు కేసీఆర్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment