జగన్‌ సీఎం కాకుండా బాబు కుట్రలు | Kodali Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

జగన్‌ సీఎం కాకుండా బాబు కుట్రలు

Published Sat, Jan 12 2019 4:13 AM | Last Updated on Sat, Jan 12 2019 4:13 AM

Kodali Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అందులో సంతకాలు చేసింది అమ్ముడుపోయిన గొర్రెలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరిని సంతలో గొర్రెల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడని, వారితో జగన్‌కు లేఖ రాయించాడని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు లభిస్తున్న òప్రజాదరణ చూసి టీడీపీ నేతలకు మతితప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అశేష ప్రజాభిమానం ఉన్న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గడువు ఇక 125 రోజులే ఉందని, ఇప్పటికైనా కొన్ని మంచి పనులు చేయాలని హితవు పలికారు. కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తిలేడు. సోనియాగాంధీని ఎదిరించిన ధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. జగన్‌న్‌ఒక్కసారి అధికారంలోకి వస్తే ఆయనను పదవి నుంచి దించేయడం ఎప్పటికీ సాధ్యం కాదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు నాలుగున్నరేళ్లలో రూ.6 లక్షల కోట్లు దోపిడీ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.6 లక్షల కోట్లు లేదని చంద్రబాబు అంటున్నాడు. మరి దోచేసిన ఇసుకను బడ్జెట్‌లో పెట్టారా? ఇసుక నుంచి రూ.25 వేల కోట్లు, నీరు–చెట్టు కింద కేంద్రం ఇచ్చిన నిధులు రూ.45 వేల కోట్లు, రాజధానిలో లక్షల కోట్ల భూములను మింగేశారు. ఇవన్నీ బడ్జెట్‌లో పెట్టారా? వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు అమలు చేయడం సాధ్యం కాదన్న చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయని ఇప్పుడు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తానని అంటున్నారు. ఇదంతా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రభావమే. 

సోనియాగాంధీకి సూట్‌కేసులు ఇచ్చాడు  
నాలుగున్నరేళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఊడిగం చేసిన చంద్రబాబు నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్లి, సోనియాగాంధీకి సూట్‌కేసులు ఇచ్చాడు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నది చంద్రబాబే. పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే. చంద్రబాబులా ముసుగు వేసుకొని ఒకరి దగ్గరకు, ముసుగు లేకుండా మరొకరి వద్దకు జగన్‌ ఎన్నడూ వెళ్లలేదు. చంద్రబాబుకు సిగ్గు శరం అనేవి లేవు. కాంగ్రెస్, పవన్‌ కల్యాణ్‌ తనతో ఉండాలని చంద్రబాబు కోరడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. దొడ్డిదారిన అధికారంలోకి రావాలనే చిల్లర రాజకీయాలు చంద్రబాబు మానుకోవాలి. 

చంద్రబాబు పెద్ద సైకో..
అసెంబ్లీకి రాని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటారని చంద్రబాబు పదేపదే మాట్లాడుతున్నాడు. అసెంబ్లీని 30 రోజులపాటు మాత్రమే నిర్వహించినా టీడీపీ ఎమ్మెల్యేలు 365 రోజులకు జీతాలు తీసుకోవడం లేదా? టీడీపీ సభ్యులు మిగిలిన 335 రోజుల జీతం వెనక్కి ఇస్తే వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా జీతాలు వెనక్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ కోడికత్తి పార్టీ అయితే మరి టీడీపీ కట్టప్ప కత్తి పార్టీనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు చంద్రబాబును గుడ్డలు ఊడదీసి పంపారు. అక్కడి సీఎం కేసీఆర్‌ వేసిన 20 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ఊరకుక్కలతో మొరిగించాడు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మోసం చేసేందుకు రోజుకో శంకుస్థాపన చేస్తున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుండి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు పెద్ద సైకో. వైఎస్‌ òజగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా తిడితే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని కొడాలి నాని హెచ్చరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement