తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిలో నలుగురికి మంత్రి పదవులిచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఈ విలువలు అప్పుడు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. రాజకీయాల్లో ఇక చంద్రబాబు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అని అన్నారు. ఇక ఆయన జీవితంలో ముఖ్యమంత్రి గానీ, ప్రతిపక్ష నేత గానీ కాలేరని చెప్పారు.
టీడీపీలో ఏర్పడ్డ సంక్షోభాన్ని చూసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. శనివారం మంత్రి కొడాలి నాని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు బోడే ప్రసాద్, కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తున్నానని, జగన్ విధానాలకు మద్దతు పలుకుతున్నానని మాత్రమే వల్లభనేని వంశీ చెప్పారన్నారు. ఆయనకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పలేదన్నారు. దేవినేని అవినాశ్‌కు జ్ఞానోదయమై తనంతట తానుగా వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. అవినాశ్ టీడీపీలో చేరేటప్పుడే చంద్రబాబును నమ్మొద్దని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఆయన.. చంద్రబాబును నమ్మి తీవ్రంగా నష్టపోయారన్నారు.
టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు?
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, తన అన్న చనిపోయాక ఎమ్మెల్యే పదవికి అడ్డొస్తుందని వదినను చంపిన దేవినేని ఉమా గురించి చెప్పాలంటే చాలా ఉందని నాని అన్నారు. జగన్.. చంద్రబాబులాగా విలువలు లేని వ్యక్తి కాదని, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటాననే షరతు విధించారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి వంశీని పార్టీలో చేర్చుకుంటున్నారని జగన్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరితే టీడీపీ నేతలకు కళ్లు కనిపించలేదా? అని నిలదీశారు. అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శిస్తే లోపలేస్తుందని భయపడ్డారా అని ఎద్దేవా చేశారు.
పవన్‌వి చౌకబారు వ్యాఖ్యలు
సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అభ్యంతరం తెలిపారు. తిరుపతి ప్రసాదం జగన్ తింటాడా, తినడా అని పవన్ ప్రశ్నిస్తున్నారని.. ఈసారి ఆయన తిరుపతి వెళ్లినప్పుడు వెంట వెళ్లి చూసుకోవాలన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు, ముగింపు తర్వాత భక్తిశ్రద్ధలతో జగన్ తిరుమలకు వచ్చారన్నారు. సన్న బియ్యం ఇస్తానని తాను చెప్పినట్లుగా దేవినేని ఉమా చెబుతున్నారని.. సన్న బియ్యం ఇస్తానని నేను ఎవరి వద్దా చెప్పలేదన్నారు. నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే అసెంబ్లీలో ప్రకటించానన్నారు. టీడీపీ హయాంలో రీసైక్లింగ్‌లో కొన్న బియ్యం మాత్రమే తమ వద్ద స్టాక్ ఉందని.. అవి తినడానికి పనికిరావన్నారు. తానేమన్నా బియ్యం తయారుచేస్తానా అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment