పథకాలు పోయాయ్‌! | YS Jagan Mohan Reddy visited Eleru flood affected areas | Sakshi
Sakshi News home page

పథకాలు పోయాయ్‌!

Published Sat, Sep 14 2024 5:44 AM | Last Updated on Sat, Sep 14 2024 5:44 AM

YS Jagan Mohan Reddy visited Eleru flood affected areas

ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు.. పిల్లలను, మహిళలను, నిరుద్యోగులను మోసగించారు

మళ్లీ టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి

ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యం.. వలంటీర్ల వ్యవస్థ కనుమరుగు

ఈ– క్రాప్‌ లేదు.. ఉచిత పంటల బీమా గాలికొదిలేశారు..  రైతులకు రూ.20 వేలు ఇస్తామని ఒక్క రూపాయైనా ఇచ్చారా?

పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఆర్టిస్ట్‌ అయితే  బాబు డ్రామా ఆర్టిస్టులా మారారు  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రజలకు ప్రతి ఒక్కటీ డోర్‌ డెలివరీ చేస్తే ఇప్పుడు ఏది కావాలన్నా టీడీపీ నాయకులను, జన్మభూమి కమిటీలను వేడుకోవాల్సిన దుస్థితి నెలకొందని మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘ఎన్నికల ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పిల్లలు కనిపిస్తే చాలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని వారినీ మోసగించారు. 50 ఏళ్లు దాటిన అమ్మలు కనిపిస్తే చాలు.. జగన్‌ మీకు రూ.18,000 మాత్రమే ఇస్తాడు! చంద్రన్న రూ.48 వేలు ఇస్తాడంటూ వారినీ మోసం చేశాడు. 

మరి ఎక్కడైనా రూపాయి ఇచ్చాడా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 వంతున ఏటా రూ.36 వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలైనా ఒక్కటీ అమలు కాలేదు. అమ్మఒడి లేదు.. సున్నా వడ్డీ పోయింది.. చేయూత లేదు! ఇంత అన్యాయంగా అందరినీ మోసం చేస్తూ బడి పిల్లల గోరుముద్దను సైతం నిర్వీర్యం చేశాడు. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా అసలే లేదు. 108, 104 సిబ్బందికి జీతాలు లేవు. మూడు త్రైమాసికాలు గడిచిపోయినా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందలేదు. వసతి దీవెన లేదు’ అని విమర్శించారు. 

అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లోనే సచివాలయ సిబ్బంది పింఛన్లు పంచుతున్నారని, ఎవరైనా అలా వెళ్లి తీసుకోకుంటే కట్‌ చేస్తున్నారన్నారు. కూటమి సర్కారు పాలనలో ఎవరైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారని, పాలన అస్తవ్యస్థంగా మారిందని ధ్వజమెత్తారు. ‘ఇలాంటి దారుణ పాలన పోవాలి. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. వారు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. చంద్రబాబు మోసాలకు కోపం వస్తోంది. ఆ భయంతోనే రెడ్‌బుక్‌ పాలనకు తెర తీశారు. అయినా ఏమీ చేయలేరు. 

ప్రజలు భరించే పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఆర్టిస్ట్‌ అయితే సీఎం చంద్ర­బాబు ఫొటోలకే పరిమితమై డ్రామా ఆర్టిస్టుగా మారారని, పవన్‌ కంటే బాగా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్న అనంతరం రమణక్కపేటలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

బాబు ఇచ్చింది ఏమిటి? 
2014–19 మధ్య 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411 కోట్లు ఇన్సూరెన్స్‌ డబ్బులు మాత్రమే చంద్రబాబు పంటల బీమా కింద ఇచ్చారు. అదీ కూడా ప్రీమియం రైతులు కడితేనే వచ్చాయి. మరి ఆయన ఇచ్చింది ఏమిటి? అదే జగన్‌ హయాంలో రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు ఉచిత పంటల బీమా కింద అందాయి. మా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. 

చంద్రబాబు పెట్టిన రూ.715 కోట్ల బకాయిలను కూడా నాడు మా ప్రభుత్వమే చెల్లించింది. ఒక్క రైతు భరోసా కిందే 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. రైతులు నష్టపోతే ఆదుకునేందుకు గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా అన్ని విధాలా తోడుగా నిలిచాం. ఇప్పుడు అవేవీ లేకపోవడం, వ్యవస్థలను అస్తవ్యస్థంగా మార్చేయటంతో అన్నదాతలు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. 

ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. సున్నా వడ్డీ, పంట రుణాలు ఏమయ్యాయి? పెట్టుబడి సాయం ఏమైంది? ఈ–క్రాపింగ్‌ జరగడం లేదు. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యం అయిపోయాయి. వలంటీర్ల వ్యవస్థ కనుమరుగైపోయింది. ఉచిత పంటల బీమాను గాలికొదిలేశారు. రైతుల తరఫున ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు? 

అదే ఇవాళ మీ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే రైతన్నకు రైతు భరోసా రూ.13,500 వచ్చి ఉండేది. ఎకరాకు రూ.7 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ సీజన్‌ ముగిసేలోగా వచ్చి ఉండేది. ఉచిత పంటల బీమా పథకం కింద రూ.24 వేల నుంచి రూ.29 వేల వరకూ పంటల బీమా రైతులకు అందేది. సున్నా వడ్డీ కింద రైతులకు ఎకరాకు కనీసం రూ.4 వేలు వచ్చేవి. అన్నీ కలిపి రైతులకు ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అందేది. పంట నష్టం జరిగితే మేం హెక్టారుకు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో కేవలం రూ.15 వేలు మాత్రమే అందేది. 

పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు ఇంతవరకు కనీసం ఈ–క్రాప్‌ కూడా చేయించలేదు. గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీల కోసం జాబితాలు ఎందుకు ప్రదర్శించడం లేదు? మళ్లీ రైతులు టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. పారదర్శకత ఎక్కడా లేదు. 2023–24 ఖరీఫ్‌లో వచ్చిన కరవుకు సంబంధించి రూ.1,278 కోట్ల ప్రీమియంను ఈ ప్రభుత్వం కట్టాలి. కానీ చంద్రబాబు డబ్బులు కట్టకుండా, రైతులకు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు.

జగన్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ / గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భదత్ర పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. బుధవారం గుంటూరు జిల్లాలో, శుక్రవారం కాకినాడ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రతా లోపాలు ఆందోళన కలిగించాయి. ఈ రెండు పర్యటనల్లో వైఎస్‌ జగన్‌కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. 

మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదు. కేవలం ఒక్కో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, అరకొరగా కానిస్టేబుళ్లను భద్రతకు వినియోగించారు. వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించడంలో వైఫల్యాలపై ఇప్పటికే వైఎస్సార్‌సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయస్థానంలో కేసు కూడా వేసింది. అయినా ప్రభుత్వం పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా స్పందించడంలేదు. ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

గుంటూరులో కనీస భద్రతా లేదు  
టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో అరెస్ట్‌ చేసిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాసరెడ్డి గుంటూరు జైలులో ఉన్నారు. వారిని ములాఖత్‌లో పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ బుధవారం అక్కడికి వెళ్లారు. తాడేపల్లిలోని నివాస గృహం నుంచి బయల్దేరిన ఆయనకు సాధారణ భద్రత మాత్రమే కల్పించారు. గుంటూరు అమరావతి రోడ్‌లోకి ప్రవేశించిన దగ్గర నుంచి లాడ్జి సెంటర్, తాలుకాసెంటర్‌  మీదుగా జిల్లా జైలుకు చేరే వరకూ దారి పొడుగునా పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. 

భారీగా తరలివచ్చిన వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించనే లేదు. దాంతో పలువురు గోడలు, గేట్లు వైఎస్‌ జగన్‌ ఉన్న ప్రదేశానికి వచ్చేశారు. అక్కడక్కడ గుంపులుగా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక జైల్లో ములాఖత్‌ ముగిసి, బయటకు వచ్చిన  జగన్‌ వద్ద పోలీస్‌ భద్రతే కనిపించలేదు. అక్కడే చెట్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వద్దకు చేరుకునేందుకు ఆయనకు చాలా కష్టమైంది.

హెలిపాడ్‌ దగ్గరా నిర్లక్ష్యంగా పోలీసులు 
శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్ద కూడా కనీస భద్రత లేదు. హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేసరికి ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత హెలిపాడ్‌ ఉన్న కాలేజీ గేటును పోలీసులు తెరవడంతో ఒకేసారి పెద్ద సమూహం జగన్‌ను చుట్టుముట్టింది. అక్కడే ఉన్న రోప్‌ పార్టీ, పది మంది పోలీసు కానిస్టేబుళ్లు ఆ గుంపును నియంత్రించేందుకు కూడా ప్రయత్నించలేదు. 

ఎవరు పార్టీ కార్యకర్తలో ఎవరు విద్రోహ శక్తులో కూడా గుర్తించే పరిస్థితి లేదు. మాధవపురం వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న కారు పైకి కొందరు యువకులు ఎక్కి హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. వారిని అడ్డుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నించలేదు. నాగులాపల్లి, ఇసుకపల్లి, రమణక్కపేట వద్ద జనం పెద్దఎత్తున జగన్‌ కాన్వాయ్‌ను చుట్టుముట్టిన సందర్భంలో రోప్‌ పార్టీ తగిన రీతిలో స్పందించ లేదు. 

మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇలాగే అరకొరగా ఉంటే అభిమానుల ముసుగులో విద్రోహ శక్తులు ప్రవేశించినా అడ్డుకునే పరిస్థితే లేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు జగన్‌పై జరిగిన దాడులను గుర్తుకు తెస్తున్నారు. ఒక మాజీ సీఎంకు భద్రతపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement