సీఎం జగన్‌ దెబ్బతో.. బాబు గ్యాలరీ ఎక్కారు | Kodali Nani Fires On Chandrababu In AP Assembly | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ దెబ్బతో.. బాబు గ్యాలరీ ఎక్కారు

Published Thu, Jan 23 2020 4:51 PM | Last Updated on Thu, Jan 23 2020 5:35 PM

Kodali Nani Fires On Chandrababu In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి : పెద్దల సభ అంటే సలహాలు, సూచనలు ఇచ్చి బిల్లును ఆమోదించాలని  పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి నాని తెలిపారు. శాసనసభలో చేసిన బిల్లుపై చర్చించాలే తప్ప తిరస్కరించవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనమండలి గ్యాలరీ ఎక్కారని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే సీఎం వైఎస్‌ జగన్‌ ఆయనను శాసనసభ గ్యాలరీ కూడా ఎక్కిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై నేడు శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిన్న అశోక్‌బాబు మండలి చైర్మన్‌ షరీఫ్‌ వద్దకు వెళ్లాడనేది అవాస్తమని చెప్పారు. రూల్స్‌ పాటిస్తానని చెప్పిన మండలి చైర్మన్‌.. తన మాటకు కట్టుబడలేదని అన్నారు. 

శాసనమండలి లేకపోతే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ మంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. 1983లో ఉన్నటువంటి బ్యాచే మళ్లీ మండలిలో చేరిందని విమర్శించారు. అందుకే అప్పట్లో ఎన్టీఆర్‌ మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. అయితే మంచి సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి శాసనమండలిని పునరుద్ధరించారని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని లోకేశ్‌కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్‌ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మండలిని తీసేయాలనే అంశాన్ని కచ్చితంగా ఆలోచించాలని కోరారు.

తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదని స్పష్టం చేశారు. మండలిలో ఇంగ్లిష్‌ మీడియం, ఎస్సీ, ఎస్టీ బిల్లులను ఆపేశారని.. ఇప్పుడు ఏకంగా వికేంద్రీకరణ బిల్లుకే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మండలి చైర్మన్‌కు డైరెక్షన్స్‌ ఇచ్చారని.. ఇలాంటి పనులు చేయడానికి ఆయనకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాగి వచ్చారో.. ఇంకెవరు తాగొచ్చారో తెలియదని.. యనమల రామకృష్ణుడుతో సహా టీడీపీ నేతలకు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ చేయాలని అన్నారు. యనమల పేరెత్తితే వెన్నుపోటు గుర్తుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి  తమకు సలహాలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. మండలిలో టీచర్‌, పట్టభద్ర ఎమ్మెల్సీల్లో చాలా మంచివారున్నారని తెలిపారు. వారితోపాటు.. బీజేపీ ఎమ్మెల్సీలు కూడా వికేంద్రీకరణ బిల్లు ఆపొద్దని విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement