
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో శాసనసభకు పోటీచేయడానికి యువకులకు అవకాశం ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు ఆ పార్టీ యువజన విభాగం నేతలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ల భేటీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగాలు, ఉపాధి ప్రధాన నినాదంగా రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని గుర్తుచేశారు. ఎందరో యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానం జరిగిందని, కానీ ఆ అమరుల ఆకాంక్షలు ఈ ఐదేళ్లలో నెరవేరలేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌ను ఓడించకుంటే ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని హెచ్చరించారు. నవంబర్ 1న టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో యువజన సమితి రాష్ట్ర విస్తృతస్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి 31 జిల్లాల యువజన సమితి కమిటీల ముఖ్యులు హాజరుకావాలన్నారు. ఈ సందర్భంగా యువజన సమితి నేతలు తమ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోదండరాంను కోరారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, టీజేఎస్ రాష్ట్ర నాయకులు ధర్మార్జున్, రౌతు కనకయ్య, చింతా స్వామి, వెంకట్‌రెడ్డి, యువజన నాయకులు ఆశప్ప, సలీంపాషా, ఆంజనేయులు, లింగస్వామి, పూసల రమేశ్, రమణ్ సింగ్, వినయ్, కొత్త రవి, అజయ్, జీవన్‌రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment