దీక్షలో పాల్గొన్న కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అధికారం మత్తులో అమరులను యాది మరిచారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను అధికారం వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారైనా కలవలేదని దుయ్యబట్టారు. ఇలాంటి కేసీఆర్‌కు ఇప్పుడే కాదు, ఈ జన్మలో మళ్లీ అధికారం రాదన్నారు. తెలంగాణ అమరవీరులకు స్తూపం నిర్మించాలంటూ టీజేఎస్ కార్యాలయంలో బుధవారం అమరుల స్మృతి దీక్ష నిర్వహించారు.
దీక్ష ముగింపు సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు, బీడు భూములకు నీళ్లు వస్తాయని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంతో మంది యువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పా రు. కానీ కేసీఆర్‌కు అధికారం, కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చేవాళ్లు, ఉద్యమకారులపై తెగబడి దాడులు చేసిన వాళ్లే దగ్గరి వాళ్లయ్యారని ఆరోపించారు. ధర్నా చౌక్ ఎత్తేశారని, పోలీసుల రాజ్యంగా తెలంగాణను చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, మానవహక్కులను హరించేలా నియంతలాగా రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు.
పదవుల్లో తెలంగాణ ద్రోహులు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, తెలంగాణ ద్రోహులను పదవుల్లో కూర్చోబెడుతున్నారని కేసీఆర్‌పై కోదం డరాం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అశాంతి, టీఆర్‌ఎస్‌పై అసంతృప్తి, ఆగ్రహం పెరుగుతోందన్న భయంతో కేసీఆర్ ముందే దిగిపోయారన్నారు. ప్రజలకు దూరంగా గడీల్లో ఉంటూ, పోలీసు రాజ్యంగా మారిన పాలన కూలాలన్నారు. గడీల పాలనను కూల్చడానికి ఎవరితోనైనా కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎవరూ తమను పట్టించుకోవడం లేదని అమరుల కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.
ద్రోహులు మంత్రులయ్యారు: చాడ
బుధవారం తెలంగాణ అమరుల స్మృతి దీక్ష ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్మారక స్తూపం వద్ద టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు నివాళులర్పించారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు మంత్రుల య్యారని, తెలంగాణ ఉద్యమ కారులు ద్రోహులయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపులతో రాజకీయాలను టీఆర్ ఎస్ కలుషితం చేస్తోందని విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేద్దామని టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment