
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆసుపత్రులకు నిధులను ఇవ్వడం లేదని సీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గాంధీ ఆసుపత్రిని శనివారం సందర్శించిన అనంతరం మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులే కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు గాంధీ ఆసుపత్రిలో దుస్థితికి ఎక్కడా పొంతన లేదన్నారు.
రోజుకు 4,500 రోగులు గాంధీకి వస్తున్నారని, అక్కడ 2,200 మాత్రమే బెడ్స్ ఉన్నాయి. నిర్వహణకు కూడా నిధులను కేటాయించడం లేదన్నారు. గాంధీలో 700 మంది నర్సులు ఉండాల్సి ఉండగా.. 400 మందే ఉన్నారని చెప్పారు. నర్సు పోస్టులు 300 ఖాళీగా ఉన్నాయన్నారు. మందులన్నీ బయటే కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. డెంగ్యూతో వచ్చిన పేదరోగులు ప్లేట్‌లెట్ల కోసం, మందుల కోసం అప్పుల పాలవుతున్నారని చెప్పారు. గాంధీలో రోజుకు 4గురు చనిపోతున్నారని కోమటిరెడ్డి చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ దబాయింపులు, సొల్లు మాటలను ఆపి పేదల ఆరోగ్యానికి నిధులను ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.