సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఓట్లు పడేదుంటే కేవలం మంత్రి హరీశ్‌రావు వల్లేనని సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయనే కొంచెం కష్టపడతారని పేరుందన్నారు. హరీష్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే కేసీఆర్ తనయుడు, ఐటీమంత్రి కేటీఆర్ కావాలనే వెళ్లలేదని.. ఆ సమయంలో బెంగుళూరు వెళ్లి కేటీఆర్ సినిమా చూసొచ్చాడని కోమటిరెట్టి ఆరోపించారు. సీఎం కేసీఆర్ లేకపోతే బావా, బావమరుదులు (హరీశ్ రావు, కేటీఆర్) రోడెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'మంత్రి జగదీష్ రెడ్డికి ఏం తెలుసు? ఆరు నెలల తర్వాత ఆయనకు అడ్రస్ ఉండదు. జగదీష్ రెడ్డి మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందే. కేసీఆర్ ఫ్యాక్షన్ సీఎంగా ముద్ర వేసుకున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కాల్ డేటా టైప్ చేసుకొచ్చామని మంత్రి మాట్లాడటం అవగాహనారాహిత్యం. ఆయన గాలివాటంగా మంత్రి అయ్యారు. ఆ కాల్ డేటా తప్పయితే పోలీసులు ఈ పాటికే చర్యలు తీసుకునేవారు. మేం బాధలో ఉంటే, మాపైనే ఆరోపణలు చేస్తున్నారు.
జగదీష్ రెడ్డి.. నీ పాత్ర లేకపోతే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి కేసును సీబీఐకి సిఫార్సు చేయించు.. లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. నాపై కేసులు ఉన్నాయో లేదో తెలుసుకుని మాట్లాడాలి. ఈసారి జగదీష్ రెడ్డికి నాలుగువేల ఓట్లు కూడా పడవు. వైస్ ఎంపీపీ మధన్ మోహన్ రెడ్డి హత్య కేసులో నువ్వు ఏ-2వి. నూకాబిక్షం, కడారి రాంరెడ్డి హత్య కేసుల్లో నువ్వు నిందితుడివా కాదా? మద్య నిషేద సమయంలో మద్యం అమ్ముతుంటే నీపై కేసు నమోదైందా లేదా? చెప్పాలంటూ' జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment