పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy Satires on Revanth Reddy  | Sakshi
Sakshi News home page

పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి

Published Fri, Sep 20 2019 2:26 AM | Last Updated on Fri, Sep 20 2019 3:26 AM

Komatireddy Venkat Reddy Satires on Revanth Reddy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిని గెలిపించుకుంటామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి లాంటి నేతలంతా హుజూర్‌నగర్‌లో ఐకమత్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ విషయంపై మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డి ఎవరని, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు నల్లగొండ వ్యవహారాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పక్క జిల్లా నుంచి వచ్చి తమ వ్యవహారాల్లో వేలు పెడితే సహించేది లేదన్నారు. హుజూర్‌నగర్‌ నుంచి పద్మావతి కాకుండా ఎవరైనా పోటీ చేయాలని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నేతలను అడిగామని, అంతా పద్మావతి పేరునే ప్రతిపాదించా రని చెప్పారు. నల్లగొండ జిల్లా కీలకనేతల మధ్య గతంలో ఉన్న భేదాభిప్రాయాలను పోగొట్టుకుని అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.  
 

పీసీసీ రేసులో నేను తప్ప ఎవరూ లేరు.. 
పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘రేసులో ఉండడం ఏంటి? నేను తప్ప పీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఎవరూ లేరు. వీహెచ్‌ను అడిగినా, ఎవరిని అడిగినా, పాత కాంగ్రెస్‌ నేతలెవరైనా నాకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు’అని వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటును చూసిన తర్వాత అసెంబ్లీ చిన్నగా కనిపిస్తోందన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఆర్థికమంత్రి హరీశ్‌ను కోరానని ఎంపీ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement