
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. బుధవారం హన్మకొండలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన 125 అంశాల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని అన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల్లో చేసిన 600 వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవెర్చలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్‌లు, నీళ్లు, నిధులు, నియామకాల్లో పురోగతి సాధించలేదని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వాలలో దేశంలో మొదటి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ రూ.లక్ష వరకు కాగా.. వడ్డీ మాఫీ మాత్రం కాలేదన్నారు. జిల్లాలో బిల్డ్ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కృషి చేస్తామని తెలిపారు.