సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంపన్న రాజకీయ నాయకుడిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 895 కోట్లుగా పేర్కొన్నారు.
భార్య ఆస్తి విలువ రూ. 613 కోట్లు..
తన చరాస్తుల విలువ 223 కోట్లుగా పేర్కొన్న విశ్వేశ్వర్ రెడ్డి.. తన భార్య, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి చరాస్తుల విలువ 613 కోట్ల రూపాయలని వెల్లడించారు. ఇక తన కుమారుడి చరాస్తుల విలువ రూ. 20 కోట్లని పేర్కొన్నారు. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 36 కోట్లుగా పేర్కొన్న ఆయన.. భార్య స్థిరాస్తుల విలువ కేవలం రూ. 1.81 కోట్లని తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 528 కోట్లని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ తన ఆస్తుల విలువ 667 కోట్ల రూపాయలని ప్రకటించారు. నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన.. ఈ మేరకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఏపీ సీఎం, కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment