సాక్షి, జగిత్యాల: తెలంగాణ ఏర్పాటుకు అడ్డంపడిన గడ్డాలన్నీ.. గండాలై మళ్లీ ఏకమవుతున్నాయని మంత్రి కె.తారకరామారావు అన్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకే ముసలినక్క కాంగ్రెస్.. గుంట నక్క చంద్రబాబు ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. వీరు ఎన్ని నాటకాలాడినా గూబగుయ్‌మనిపిస్తామని చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలను తూర్పారబట్టారు. ‘తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉందని.. డిసెంబర్ 11న డబ్బాలు తెరిస్తే కేసీఆర్ ఓటమి తెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తుండు.. నేనంటున్న తెలంగాణలో ఉన్నది శబ్ధ విప్లవమే.. వంద సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తున్నాం..’అని కేటీఆర్ అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో.. 17 ఏళ్ల టీడీపీ పాలనలో జరగని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే చేసినందుకు కేసీఆర్‌ను ఓడించాలా..? అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి.. ప్రజలకు మధ్య కొట్లాటగా అభివర్ణించిన ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఢిల్లీలోని రాహుల్‌గాంధీ కుటుంబం అహంకారానికి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పంచాయితీ అని పేర్కొన్నారు. ‘కరెంట్ అడిగితే కాల్చి చంపిన.. కరెంట్ ఇవ్వకుండా 67 ఏళ్లు కాల్చుకుతిన్న దొంగలు ఓ గట్టు మీద ఉన్నరు. అడక్కుండానే 24 గంటల కరెంట్ ఇచ్చి ఆదుకున్న కేసీఆర్ మరో గట్టు మీద ఉన్నరు.. వీరిద్దరిలో మీరు ఎటువైపో తేల్చుకోవాలి’అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రైతుల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రులు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వారికి మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే గోదావరి నదిపై కాళేశ్వరం.. సీతారామ ప్రాజెక్టులు, కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల పథక నిర్మాణ పనులకు కేసీఆర్ పచ్చజెండా ఊపితే.. చంద్రబాబు మాత్రం ఆ ప్రాజెక్టు పనులు నిలిపేయాలంటూ కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారని మండిపడ్డారు. ప్రస్తుతం కాళేశ్వరం పనులు కాలంతో పోటీ పడుతున్నాయని, ఆరు నెలల్లో పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందని, అప్పుడు ఆ ప్రాజెక్టు పనులు ముందుకెళ్తాయా..? అని ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. డిసెంబర్ 7న పోలింగ్ తేదీలోగా ఇంటింటికీ నల్లానీరు అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. వెయ్యి, రూ.1500 ఉన్న పెన్షన్లు రూ. 2,016, రూ. 3,016కు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. సభలో తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment