సాక్షి, హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఇటీవల గద్వాలలో జరిగిన సభలోనూ ఇదే సవాలు చేశానని, సవాలును ఎవరు స్వీకరించినా, స్వీకరించకున్నా మాట మీద ఉంటానని, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలా కుటుంబాల చాటున దాక్కోనని విమర్శించారు. బుధవారం ప్రగతి భవన్‌లో మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
గత మూడున్నరేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టారని, అయినా వారికి విషయం బోధపడటం లేదని ఎద్దేవా చేశారు. కేడర్‌లో జోష్ పెంచేందుకు తమకు 70 సీట్లు వస్తాయంటూ ఉత్తమ్ తాడూ బొంగరం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దుష్పరిపాలన ఫలితంగానే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పెరిగిందని, మిషన్ భగీరథతో అందించే ప్రతి నీటిబొట్టులో సీఎం కేసీఆర్ కనిపిస్తారని చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి పెట్టుబడి సాయం, 24 గంటల కరెంటు వంటి వాటివల్ల తమ బలం పెరుగుతుందని, కాంగ్రెస్ చెబుతున్న నిశ్శబ్ద విప్లవం వంటిదేదీ రాదని పేర్కొన్నారు.
ఒళ్లు దగ్గర పెట్టుకోండి
కేసీఆర్ దద్దమ్మ అని ఉత్తమ్ అంటున్నారని, రాహుల్ గాంధీ కంటే దద్దమ్మ దేశంలో ఎవరున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందెవరో ఉత్తమ్ చెప్పాలన్నారు. 55 ఏళ్ల పాలన నుంచి విముక్తి కల్పించిన కేసీఆర్‌ను దద్దమ్మ అంటారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యల్లేవని, నల్లగొండ లో జరిగిన ఓ హత్యను రాష్ట్రానికి పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
‘హత్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రుల పీఠాల కోసం నరమేధాన్ని సృష్టించింది ఎవరు? దేశంలో ఎమర్జెన్సీని ఎవరు పెట్టారు? ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారా? వీళ్లంతా లోఫర్‌గాళ్లు’ అని విమర్శించారు. 356 ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది ఎవరు? మీడియా గొంతు నొక్కింది ఎవరని ప్రశ్నించారు. స్థానిక హత్యను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రానికి పూయాలని చూస్తున్నారని, ఆయన టీఆర్‌ఎస్ తలుపులు తట్టీతట్టీ కుదరక వెనక్కి పోయారన్నారు.
పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కోదండరాం పెట్టనున్న కొత్త పార్టీ పై కేటీఆర్ అభిప్రాయపడ్డారు. చెరుకు సుధాకర్, పవన్ కల్యాణ్, కోదండరాం, చంద్రకుమార్ ఇలా ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, ఎవరేంటో ప్రజలు తేలుస్తారన్నారు. తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ వారు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
50 ఏళ్ల చరిత్రలో నిలదొక్కున్న పార్టీలు కేవలం టీఆర్‌ఎస్, టీడీపీలు మాత్రమేనని, జాతీయ పార్టీల పని అయిపోయిందన్నారు. ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల్లో సక్సెస్ సాధిస్తున్నాయని, ఇపుడు జాతీయ పార్టీలు లేవని, ఉన్నవి కేవలం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ఎవరికీ అర్థం కావడం లేదని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే కత్తులు దూస్తున్నాయని వ్యాఖ్యానించారు.
‘బాహుబలి’కలెక్షన్లే మేలు!
కేంద్రానికి రూ.40 వేల కోట్ల ప్రతిపాదనలు పంపితే బాహుబలి సినిమా కలెక్షన్ల మందం కూడా రాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మం త్రులే బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇంత దారుణమైన బడ్జెట్ ప్రవేశపెట్టి ఎవరిని మెప్పి స్తారని ప్రశ్నించారు. హక్కుగా రావాల్సిన దానికంటే ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదన్నా రు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. దత్తాత్రేయను మంత్రిగా తీసేశారని, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇక్కడ బిల్డప్‌లు ఇస్తున్నారని, రాష్ట్రానికి అదనంగా ఏం ఇచ్చారని
విమర్శించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే
‘సిరిసిల్లను వదిలి రావాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్‌కు ఎందుకు వస్తా? ఇక్కడ నాయకత్వం తక్కువ ఉందా? హైదరాబాద్‌కు వచ్చే ఆలోచన ఏమీ లేదు’అని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019లో ఒంటరిగానే పోటీకి దిగుతామని, 2014 కంటే బలంగా అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ నాయకులకు పని లేక హరీశ్‌కు, నాకు సఖ్యత లేదంటూ ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్‌తో పోల్చుకునే సీన్ ఉత్తమ్‌కు లేదు. మాట్లాడితే నన్ను బచ్చా అంటున్నారు. రాహుల్ కూడా బచ్చానే. కనీసం నాకు పెళ్లి అయ్యింది. రాహుల్‌కు పెళ్లి కూడా కాలేదు’అని అన్నారు. రాజకీయ వారసత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, కేసీఆర్ ఇంకా 10, 15 ఏళ్ల వరకు రాష్ట్రాన్ని నడుపుతారన్నారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ తన పరిధిలోని అంశం కాదని, అది సీఎం చూసుకుంటారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఎక్కడుందని, లేని సంస్థతో పొత్తు ఎక్కడిది? విలీనం ఎక్కడిదని ప్రశ్నించారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ ముగింపు సదస్సుకు రాష్ట్రపతిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మెట్రో స్పీడ్ పెంచుతున్నామని, అందులో జర్నలిస్టులకు రాయితీలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment