ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలి | Opposition Meets Rajat Kumar over MLC Elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలి

Published Wed, May 8 2019 4:17 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

 Opposition Meets Rajat Kumar over MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించిన షెడ్యూల్‌ను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. షెడ్యూల్‌పై ప్రకటన రానుందని ముందే తెలిసినట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటనే అభ్యర్థులను ప్రక టించిందని, ఈ విషయంలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది. సోమవారం మండలి ఎన్నికల షెడ్యూల్‌ ఇచ్చేసి, మరుసటి రోజు ఉదయం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడం సరికాదని తప్పుబట్టింది. టీపీసీ సీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష పార్టీల నేతలు మంగళవారం సీఈఓ రజత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందించారు.

అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను రెండు వారాలు వాయిదావేసి కొత్తగా ఎన్నిక కానున్న జెడ్పీ టీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తా మన్నారు. డిసెంబర్‌లో జరిగిన రాజీనామాలతో ఖాళీ అయిన స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను గత మార్చిలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటే ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. మే 31న ఎన్నికలు పెట్టి మరికొన్ని రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటేసే అవకాశం కల్పించ డం సరికాదని తప్పుబట్టారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను సీఈఓ కార్యాలయ వెబ్‌సైట్‌లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.

ఓటర్ల జాబితా గురించి తనకు తెలియదని సీఈఓ అంటున్నారని, ఓటర్లు ఎవరో తెలియకుండా ఎన్నికల నోటిఫికేషన్‌ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. కొత్తగా ఎంపిక కానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించకుండా త్వరలో మాజీలు కాబోతున్న వారికి ఓటు హక్కు కల్పించడం సరికాదన్నా రు. టీఆర్‌ఎస్‌ ఈసీతో కుమ్మక్కై త్వరలో మాజీలు కాబోతున్నవారికి ఓటు హక్కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ, సీపీ ఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా, పార్టీ నేత సుధాకర్‌రెడ్డి, టీజేఎస్‌ నేత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement