కేపీహెచ్‌బీకాలనీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ప్రేమ లేదని, వారి కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఓడిపోయే కూకట్‌పల్లి సీటును నందమూరి సుహాసినికి కేటాయించారని అన్నారు. గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో చేపట్టిన రోడ్‌షోలో భాగంగా కేపీహెచ్‌బీకాలనీ బస్టాప్ సెంటర్‌లో ఆయన మాట్లాడారు. లోకేష్‌బాబును నేరుగా మంత్రిని చేసిన చంద్రబాబు... ఏమాత్రం రాజకీయాలు తెలియని సుహాసినిని మాత్రం ఎన్నికల్లోకి లాగి బలిపశువును చేశారన్నారు. సుహాసిని సోదరులను ఈ ఎన్నికల ద్వారా పూర్తిగా రాజకీయాలకు దూరం చేసే కుట్రలు పన్నారని ఆరోపించారు.
కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా కేవలం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని... ఇక ఏవైపు ఉంటారో ఓటర్లే తేల్చుకోవాలన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లలో ఒక్క కేపీహెచ్‌బీ మాత్రమే టీడీపీకి దక్కిందని, కేపీహెచ్‌బీ కాలనీ ప్రజలు మరోసారి మోసపోవద్దని... టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి మాధవరం కృష్ణారావును గెలిపించాలని కోరారు. కృష్ణారావు పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి 26 కులాలకు న్యాయం చేయాలని కోరారని.. బీసీ కమిషన్ ద్వారా నివేదికను తెప్పించుకొని తప్పకుండా న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, కృష్ణారావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు తప్పు చేశారు...
సీఎం కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తున్న చంద్రబాబునాయుడు ముమ్మాటికీ తప్పు చేశారని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి డబ్బు సంచులతో కెమెరాలకు చిక్కింది నిజం కాదా? మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఫోన్‌లో మాట్లాడింది నిజం కాదా? అంటూ కేటీఆర్ నిలదీశారు. కలికాలంలో వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపారని... అందులో భాగంగానే పాము, ముంగీసలైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు తీరుతో స్వర్గంలోని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment