
సాక్షి, బళ్లారి: కూడ్లిగి ఎమ్మెల్యే బి.నాగేంద్ర కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నాగేంద్ర కూడ్లిగిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాగేంద్ర శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి వర్గంలో కీలక నేతగా ఎదిగారు.
2013 ఎన్నికల ముందు శ్రీరాములు బీఎస్‌ఆర్ పార్టీ స్థాపించడంతో నాగేంద్ర అనివార్యంగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినప్పటికీ శ్రీరాములు వర్గానికే మద్దతు కొనసాగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి పరోక్షంగా సహకరిస్తూ మళ్లీ బీజేపీలోకి చేరతారనే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఆయన ఏ పార్టీలోకి చేరకుండా తటస్థుడిగా ఉంటూనే బీజేపీకి మద్దతిస్తూ వచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఒక దశలో నాగేంద్ర మళ్లీ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. అయితే అనూహ్య పరిణామాలతో నాగేంద్ర కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ఇప్పటికే మంత్రి డీకే శివకుమార్, కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావు తదితరులు ఆయనతో మంతనాలు జరిపారు. త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమైనట్లు భోగట్టా.
కాగా ఈనెల 4న బళ్లారి జిల్లాలో బీజేపీ పరివర్తన సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడ్లిగికి కూడా మాజీ సీఎం యడ్యూరప్ప రానున్నారు. అక్కడ బీజేపీ పరివర్తన సమావేశాన్ని విజయవంతం చేయడానికి నాగేంద్ర హాజరుకాకపోవడం కూడా ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది. 2008 నుంచి కూడ్లిగి అంటే నాగేంద్ర అనే స్థాయిలో ముద్ర ఉంది. ప్రస్తుతం బీజేపీ పరివర్తన సమావేశానికి ఆయన దూరం కావడంతో సమావేశాన్ని విజయవంతం చేయడానికి బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములు రంగంలోకి దిగారు. సోమవారం శ్రీరాములు జిల్లా బీజేపీ నాయకులతో కలిసి కూడ్లిగిలో జరిగే బీజేపీ పరివర్తన సమావేశం ఏర్పాట్లను సమీక్షించారు. నాగేంద్రకు కూడ్లిగిలో మంచి పట్టు ఉండటంతో ఎలాగైనా అక్కడ పైచేయి సాధించాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment