
శివకుమార్ అరెస్ట్ వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, బెంగళూరు : మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకులు 17 మంది ఎమ్మెల్యేలకు రూ. 15 నుంచి 20 కోట్ల వరకు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన నగదు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. 2008లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీఎస్ యడియూరప్ప నేరుగా జేడీఎస్ పార్టీకి చెందిన శరణపాటిల్‌కు రూ. 10 కోట్లను అఫర్ చేసినట్లు కుమారస్వామి ఆరోపించారు.
కుమారస్వామికి కోర్టు నోటీసులు
మాజీ సీఎం కుమార స్వామికి మరో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. బెంగళూరు నగరం సమీపంలో ఉన్న వడేరహళ్లిలో ఉన్న భూముల డీ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు నమోదు కావడంతో విచారణకు హాజరు కావాలని కుమారస్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. 2006లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు బనశంకరి 5వ స్టెజీ వడేరహళ్లిలో ఉన్న 2.4 ఎకరాల భూమిని డీ నోటిఫికేషన్ చేయడంతో 2012లో ఆయనపై కేసు నమోదు చేశారు. చామరాజనగర జిల్లా సంతమారనహళ్లికి చెందిన మహాదేవ స్వామి డీ నోటిఫికేషన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు కుమారస్వామికి నోటీసులు జారీ చేసింది.