సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్‌ల కూటమి అధికార పగ్గాలు చేపట్టి నేటికి(గురువారానికి) వంద రోజుల పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి, జేడి(ఎస్) చీఫ్ హెచ్‌డి. కుమారస్వామి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ తీరుపట్ల రాహుల్ సంతృప్తిగా ఉన్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత హుందాగా, దూకుడుగా పనిచేయాలని సూచించినట్లు వివరించారు. కర్ణాటకలో జరుగుతున్న అభివృద్ది గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.
చేసిన పనులు..
12 ఏళ్ల తర్వాత కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి పలు పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జాతీయ బ్యాంకుల్లో రైతుల రుణాల మాఫీ చేశారు. బెంగళూరులో ఇష్టారాజ్యంగా నెలకొల్పిన పరిశ్రమలపై చర్యలు తీసుకున్నారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోరాకు పోరాడుతున్న ఉద్యమకారులను శాంతింపచేయడానికి రెండో రాజధాని ప్రతిపాదనను తీసుకొచ్చారు. బెలగావీ నగరాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామని కుమారస్వామి ప్రకటించారు. బెలగావీకి రెండో రాజధాని హోదా కట్టబెడుతూ 2006లో నాటి జేడీఎస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు (కర్ణాటక నీరావరీ నిగమ్, కృష్ణభాగ్య జల నిగమ్, సమాచార కమిషనర్ కార్యాలయం) బెలగావి నగరానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాలో పర్యటించి వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
కుమారస్వామి ‘టెంపుల్’రన్
కుమారస్వామి అభివృద్ధిపై కంటే సీఎం పీఠం కాపాడుకోవడానికే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఐదేళ్లు పదవిలో ఉండాలని ఇప్పటివరకు యాభైకి పైగా వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, దర్గాలు తిరిగారని విమర్శిస్తున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వటం నచ్చని మాజీ సీఎం సిద్ద రామయ్య అసంతృప్తిగా ఉన్నారు. జేడి(ఎస్) ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఏరియల్ సర్వేలో భాగంగా కుమారస్వామి విమానంలో పేపర్ చదవటం, మంత్రి రేవన్న వరద బాధితులపై బిస్కట్ ప్యాకట్లు విసరటంపై విపక్షాలు మండిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment