
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఖాళీ అయిన మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల్లో నుంచి కుమార స్వామి పోటీ చేసి విజయం సాధించారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించడంతో రామ్‌నగర స్థానానికి రాజీనామా చేయక తప్పలేదు. రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఉప ఎన్నికలు జరగాల్సిన బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలతో పాటు, రామ్‌నగర, జంఖాడీ అసెంబ్లీ స్థానాల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి.
కుమార స్వామి భార్య పోటీ..
కుమారస్వామి రాజీనామా చేసిన రామ్‌నగర స్థానం నుంచి ఆయన సతీమణి అనిత కుమారస్వామి పోటీ చేస్తారనే ఊహాగానాలు కన్నడనాట కోడైకూస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదలైన మరునాడే ఆమె రామ్‌నగర నియోజకవర్గంలో పర్యటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనితనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది ఆమె మద్దతుదారులు ఇదివరికే ప్రకటించారు. ఈ వార్తలను జేడీఎస్ ఖండిచకపోగా.. మరో రెండో రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా వుండగా జేడీఎస్ నేత సీఎస్ పుట్టరాజు ప్రాతినిథ్యం వహించిన మండ్యా లోక్‌సభ స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారని సమాచారం.
నిఖిల్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆయన జాగ్వార్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఆ స్థానంలో జేడీఎస్ విజయం నల్లేరుమీద నడకే. ఇక బీజేపీ సీనియర్ నేత రాములు ప్రాతినిథ్యం వహించిన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి శాంతను బరిలో నిలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరాములు ఇటీవల ఎంపీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.
ఇప్పుడు ఎన్నికలేంటీ..
మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇంకా కేవలం నాలుగు నెలలే ఉన్నందుకు వాటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ మూడున ఎన్నికల నిర్వహించి నవంబర్ 6 ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment