
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేశ చరిత్రలోనే రాష్ట్రాల మంత్రిమండళ్లలో అట్టడుగు వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవుతారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రిమండలిలో 8 మంది బీసీలకు అవకాశం కల్పించి, బీసీల బాంధవుడయ్యారని కొనియాడారు. ఎస్సీలకు ఐదు, ఇతర సామాజిక వర్గాలకు కలిపి మొత్తంగా అట్టడుగువర్గాలకు దాదాపు 60 శాతం పదవులను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని, ప్రాణం ఉన్నంతవరకు ఆయనతోనే ఉంటానన్నారు. కర్నూలు జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాంలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జిల్లా సమస్యలపై మంత్రులతో కలసి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.