
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు అండతో తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ, సామాన్యుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ప్రాణాలంటే లెక్క చేయకుండా పేలుళ్లు జరిపారని ఆరోపించారు. 5 లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని.. ఇకపై అటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, పవన్ కల్యాణ్‌లకు ఇన్నాళ్లు కనిపించలేదా..
ప్రధాని మోదీ, బాబు కలిసి డ్రామాలాడుతున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బీజేపీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే బాబు అవినీతిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా బీజేపీ, పవన్ కల్యాణ్‌లకు చంద్రబాబు అవినీతి కనిపించలేదని, ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అవినీతిలో బీజేపీ, పవన్‌లకు భాగస్వామ్యం లేదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని దుయ్యబట్టారు. మూడు ముక్కలాట, మూడు స్తంభాలాట ఆడుతూ మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని గమనించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
అమ్మాయిల ఆత్మహత్యలకు కారణం ఎవరు..?
ఙ్ఞాన భేరీ మోగిస్తానని అంటున్న బాబుకు నారాయణ, చైతన్య కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిల గురించి ఏ మాత్రం విచారం లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. మీరు ఙ్ఞాన భేరీ మోగించేలోపు మద్యం అమ్మకాలపై మహిళలు అసమ్మతి భేరి మోగిస్తారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ముందు ఏపీలో కరువు భేరి కొనసాగకుండా చర్యలు చేపడితే మంచిదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment