
అందోల్ ,కొడంగల్ ,గద్వాల ,పాలేరు ,మధిర, జనగామ ,నాగార్జునసాగర్ ములుగు
ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న అగ్రనేతలు గెలుపు కోసం ప్రయత్నాలు.. ఆఖరి వ్యూహాల్లో నాయకులు అందరి దృష్టి ఆ నియోజకవర్గాలపైనే...
రాష్ట్రంలో నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు కొందరు రాజకీయ దిగ్గజాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు పలువురు సొంత నియోజకవర్గాల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇలా ముఖ్యనేతలకు వారి రాజకీయ ప్రత్యర్థులకు మధ్య హోరాహోరీ పోటీతో కొన్ని సెగ్మెంట్లలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యనేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అందోల్, కొడంగల్, గద్వాల, పాలేరు, మధిర, జనగామ, నాగార్జునసాగర్, ములుగులో పోటీ రసవత్తరంగా మారింది. – సాక్షి, హైదరాబాద్
అందోల్ - దామోదర
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ తరఫున మరోసారి అందోల్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చంటి క్రాంతి కిరణ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాజ నర్సింహపై విజయం సాధించిన బాబూమోహన్ ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. బాబూమోహన్‌కు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్యపై ఆధారపడి ఇక్కడి తుది ఫలితాలు ఉండనున్నాయి.
కొడంగల్ - రేవంత్
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మూడోసారి కొడంగల్ నుంచి పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం ఇక్కడ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ సైతం ఇదే తరహాలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలతో ఇక్కడి ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.
గద్వాల - అరుణ
కాంగ్రెస్‌లో మరో కీలక నేత డి.కె.అరుణ మళ్లీ గద్వాల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్ తరఫున రెండోసారి బరిలో ఉన్నారు. పాత ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అరుణ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపుపై ధీమాతో ఉండగా, కృష్ణమోహన్‌రెడ్డి ఈసారి విజయం సాధిస్తానని అంటున్నారు.
పాలేరు - తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి బరిలోకి దిగారు. మహాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రచార అంశాలుగా తుమ్మల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్‌కు బలమైన సెగ్మెంట్ కావడంతో ఉపేందర్‌రెడ్డి ఫలితంపై సానుకూల అంచనాతో ఉన్నారు.
మధిర- భట్టి
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క మధిర నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన లింగాల కమల్‌రాజ్ ఈసారి టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విక్రమార్కకు పోటీగా టీఆర్‌ఎస్ వ్యూహాలు అమలు చేస్తుండటంతో ఈ సారి ఫలితంపై ఆసక్తి పెరుగుతోంది.
జనగామ - పొన్నాల
పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మరోసారి జనగామ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్నారు. పొన్నాలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ముత్తిరెడ్డి మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సెగ్మెంట్ ఫలితం ఆసక్తికరంగా మారింది.
నాగార్జునసాగర్ - జానారెడ్డి
కాంగ్రెస్ కీలకనేత కుందూరు జానారెడ్డి మరోసారి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్నారు. సీనియర్ నేతగా జానారెడ్డికి ఉన్న పోల్ మేనేజ్‌మెంట్ అనుభవం పనికి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. టీఆర్‌ఎస్ సైతం ఈ సారి ఇక్కడ గెలుపు తమదే అంటోంది.
ములుగు- చందూలాల్
మంత్రి అజ్మీరా చందూలాల్ ములుగు నుంచి మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసిన ధనసరి అనసూయ (సీతక్క) ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చందూలాల్, సీతక్క మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment