ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డు నిబంధన సడలింపు? | CM Revanth Reddy On White Ration card mandatory for Aarogyasri Scheme | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డు నిబంధన సడలింపు?

Published Tue, Jan 30 2024 5:35 AM | Last Updated on Tue, Jan 30 2024 10:41 AM

CM Revanth Reddy On White Ration card mandatory for Aarogyasri Scheme - Sakshi

వైద్యారోగ్య శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరన్న నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా తెల్లరేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య  శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి సమీక్షించారు.

ప్రధానంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధుల విడుదలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. 

సత్వరమే ‘టిమ్స్‌’పూర్తి చేయాలి... 
వరంగల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లలో చేపడుతున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. మెడికల్‌ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్‌ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. 

డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌.. డిజిటల్‌ కార్డులు.. 
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డును ఒక యునీక్‌ నంబర్‌తో అనుసంధానించాలని.. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందిండానికి వీలవుతుందన్నారు. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పారు. 

బీబీనగర్‌ ఎయిమ్స్‌... 
బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌ చెప్పారు. ఎయిమ్స్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని... తద్వారా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో నెలకొన్న సమస్యలను అధికారులు సీఎంకు వివరించగా ఉస్మానియా హెరిటేజ్‌ భవనానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు.  

ఫార్మా కంపెనీల సీఎస్‌ఆర్‌... 
మెడికల్‌ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్‌ కీపింగ్‌ మెయింటెనెన్స్‌ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను ఉపయోగించి హౌస్‌ కీపింగ్‌ సేవలను మెరుగుపరచాలని సీఎం కోరారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్‌ డాక్టర్లు, ఆశ వర్కర్లు, స్టాఫ్‌ నర్సులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించేలా చూడాలన్నారు. 108, 102 సేవల పనితీరుపై వాకబు చేసిన సీఎం.. అవి మరింత మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కమిషనర్‌ కర్ణన్, డ్రగ్‌ కంట్రోల్‌ డీజీ కమలహాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement